జిల్లాలో రోజురోజుకు వాయుకాలుష్యం పెరిగిపోతోంది. ఇటీవల అమెరికాలోని 'హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్' నిర్వహించిన సర్వేలో భారతదేశంలో వాయుకాలుష్యం తీవ్రంగా ఉందని నివేదిక ఇవ్వగా.. ఆదిలాబాద్ జిల్లాలోనూ పరిస్థితి అలాగే ఉంది. ప్రతి పది మందిలో ఒకరిద్దరు మాత్రమే స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. విపరీతమైన కలుషితగాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తూ ప్రజలను రోగాల బారిన పడేలా చేస్తున్నాయి.
నవతెలంగాణ - ఆదిలాబాద్
ఆరోగ్యంగా ఉన్న మనిషి ఆహారం లేకుండా మూడు వారాలు తట్టుకోగలడు. నీళ్లు లేకుండా మూడు రోజులు బతుక గలడు. కానీ గాలి లేకుండా కేవలం మూడంటే మూడు నిమిషాలు కూడా మనలేడు. దీన్ని బట్టి గాలికి ఎంత ప్రాధాన్యమున్నదో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత మానవ తప్పిదాలతో పీల్చేగాలీ కలుషితమవుతున్నది. పరిశ్రమలు, మోటార్ వాహనాల నుంచి వెలువడుతున్న పొగతో, రసాయనిక ఎరువులతో గాలి కాలుష్యం రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఫలితంగా ఊపిరి తిత్తులు, కండ్ల సంబంధిత, చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి.
క్యాన్సర్ కారకం..
జిల్లాలో వాయు కాలుష్యం తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా పట్టణంలోని గాలిలో కాలుష్య కారకాలు పెరిగిపోతున్నాయి. పొగాకు, గుట్కా, మద్యం, బీడీ, సిగరెట్ వంటి ఎలాంటి దురలవాట్లు లేకున్నా.. రోజూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటున్నా.. చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యానికి గురైన వారిలో 22 శాతం మంది క్యాన్సర్ వ్యాధితో మరణించనున్నట్టు వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో కూడా ఇది తేలింది.
పరిశ్రమలతో..
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమలతో కాలుష్యం పెరిగిపోతోంది. జిల్లాలో ప్రతియేటా అటవీ విస్తీర్ణం తగ్గిపోతుండగా, వివిధ జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమలు, ఆయిల్ మిల్లులు, ఇటుక బట్టీలు, మాంగనీసు పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుమ్మూ, ధూళి, పొగతో పీల్చే గాలీ కలుషితమవుతున్నది. దీంతో ఏయేటికాయేడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
తగ్గుతున్న అడవులు
చెట్లను సైతం వ్యాపార సరుకుగా మార్చేయడంతో రోజురోజుకు అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. దీంతో వాయు కాలుష్యం మరింత పెరుగుతోంది. రహదారుల విస్తరణ, పరిశ్రమల స్థాపన, పట్టణీకరణ, గృహ, వ్యాపారావసరాల కోసం అడవులను విచ్చలవిడిగా నరుకుతున్నారు. ఫలితంగా భూ తాపం పెరిగి, కార్బన్ డయాక్సైడ్ శాతం అధికమై పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 7.16 లక్షల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి.అయితే ఈ విస్తీర్ణం రోజురోజుకు తగ్గిపోతోంది. గత పదేండ్లలో సుమారు 5 లక్షలకుపైగా చెట్లు నరికివేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
రసాయన ఎరువులతో పెనుముప్పు..
జిల్లాలో పత్తి, సోయా, కందులు, జొన్న, మొక్కజొన్నతో పాటు తదితర పంటలు సాగు చేసే వారంతా అధిక దిగుబడికోసం కత్రిమ రసాయన ఎరువులు, పురుగుల మందులను వాడుతున్నారు. పిచికారి చేసేటప్పుడు ఇవి గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయి. వివిధ రోగాలకు కారణమవుతున్నాయి.
గుట్టలపై రాయి, కంకర మిల్లులు
గుట్టలపై ఉండే చెట్లు, వాటిపై ఆధారపడే జంతువులు, సూక్ష్మజీవులు పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఎత్తయిన గుట్టలు మేఘాలను ఆకర్షించి వర్షాలను కురిపిస్తాయి. కురిసిన వర్షపు నీటిని పల్లపు ప్రాంతాలకు మెల్లమెల్లగా వదులుతూ భూగర్భ జలాల పరిరక్షణలో, ఫలితంగా అడవుల పెరుగుదలలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అలాంటి గుట్టలు జిల్లాలో వ్యాపార సరుకులా మారాయి. ఇష్టారాజ్యంగా గుట్టలను తొలుస్తూ రాయి, కంకర మిల్లులు ఏర్పాటు చేస్తున్నారు. మాంగనీస్ మైనింగ్ పేరిట తవ్వేస్తున్నారు. వాస్తవానికి క్రషర్ మిల్లులు, మైనింగ్ చేసే ప్రాంతాల్లో గుంతలు ఏర్పడినప్పుడు వాటిని మట్టితో పూడ్చి చెట్లు పెంచాల్సి ఉండగా, ఎక్కడా అమలు కావడం లేదు. ఫలితంగా అక్కడి అటవీ విస్తీర్ణం తగ్గడంతో పాటు, వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
పెరుగుతున్న పట్టణీకరణ
రోజురోజుకు పట్టణీకరణ పెరిగిపోవడంతో వాయు కాలుష్యం పెరుగుతోంది. ద్విచక్ర, బహుచక్ర, వ్యక్తిగత వాహనాలు అవసరానికి మించి వాడటంతో వాయు కాలుష్యం విపరీతమైంది. గతంలో చాలా దూరం అనాయసంగా నడిచేవారు. క్రమంగా వాహనాలు ఎక్కువ కావడంతో ట్రాఫిక్ జాంలు, స్లో ట్రాఫిక్ల వల్ల ఇంధన ఖర్చు పెరగటం, కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటివి గాలిలో కలిసి కాలుష్యం బారిన పడుతున్నారు జనాలు.
40 రకాల కాలుష్య ఉద్గారాలు
40 రకాల కాలుష్య ఉద్గారాలు గాలిలో కలిసి వాయువును కలుషితం చేస్తున్నాయి. వాహనాలు, రోడ్లు, చెత్తను కాల్చడం, నిర్మాణ పనులు వంటి కారణంగా వాయువు కలుషితం అవుతున్నది. వీటిలో అతి సూక్ష్మకణాలు అంటే నుసి(పీఎం 2.5), సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ఉద్గారాలు ఉంటాయి. కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించిన ప్రకారం ఉద్గారాలు గాలిలో 60 మైక్రోగ్రాములకు మించరాదు. అయితే పట్టణాల్లో 100 మైక్రో గ్రాములకు మించి నమోదవుతున్నది. ప్రధానంగా ఎండాకాలం ఈ కాలుష్యం మరింత ఎక్కువగా పెరుగుతున్నది. పొడి వాతావరణం, ఎండ వేడి కారణంగా గాలిలో ఇవి తొందరగా కలిసి వాయుకాలుష్యం పెరుగుతున్నదని పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు, కాలుష్య నియంత్రణ మండలి) పరిశీలనలో తేలింది.
గుండెపోటు.. మధుమేహం
రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంతో గుండెపోటు, మధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. వాయు కాలుష్యం వలన గుండెపోటు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌లో అత్యధిక సమయం గడిపేవారు గుండెపోటుకు గురవుతున్నట్టు వివిధ పరిశోధనల్లో తేలింది. వివిధ రకాల రసాయనాలతో కూడుకున్న వాహనాల ద్వారా వెలువడే పొగ,కార్ల ద్వారా వచ్చే కాలుష్యం వలన రక్తంలో కొవ్వు శాతం అధికమైనట్లు చెబుతున్నారు. దీనివలన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుపోవడం, లేదా రక్తనాళాలు మూసుకు పోవడం జరుగుతోందని, దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరిస్తున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలికంగా వాయు కాలుష్యానికి గురయ్యే వారు టైప్-2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. గ్లూకోజ్ జీవక్రియ బలహీనపడిన వారిలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.
చెత్తతోనూ సమస్య..
చెత్తను కాల్చడంతో కూడా విపరీతంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. పట్టణాలకు సమీపంలోని గ్రామాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడం, వాటిలో పశువుల కళేబరాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వస్తువులు, చెత్తాచెదారాన్ని వేసి కాలుస్తున్నారు. దీంతో అందులో నుంచి వెలువడుతున్న పొగ పక్కనే ఉన్న గ్రామాలను చుట్టేస్తోంది. అంతేకాకుండా ఇటుక బట్టీల నుంచి వెలువడుతున్న పొగ కూడా ప్రజలను ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో ప్రజలు నిత్యం వాయుకాలుష్యంతో శ్వాసకోశవ్యాధుల బారిన పడి అవస్థలు పడుతున్నారు.
పాతవాహనాలతోనూ సమస్య..
15 ఏండ్లు దాటిన వాహనాలు జిల్లాలో వేల సంఖ్యలోనే ఉన్నాయి. కాలం చెల్లిన వాహనాలు వెలువరించే కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నిబంధనల ప్రకారం 15 ఏండ్లు గడువు దాటిన వాహనాలను రీ సైక్లింగ్ చేయాలి. రోజు రోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్య తీవ్రతను తగ్గించాలంటే పాత వాహనాలను రోడ్డెక్కనీయకుండా నిలువరించాలి. కాలం చెల్లిన వాహనాల నిర్వహణ సరిగా లేకపోవడంతో పెద్ద మొత్తంలో వాయు కాలుష్యం కమ్మేస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో రోడ్లపై వెళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఉంటోంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించాలి. సాధ్యమైనంత మేర చెట్ల నరికివేతను ఆపాలి.
* వ్యక్తిగత వాహనాలైన కార్లు, మోటార్‌సైకిళ్ల వినియోగాన్ని సాధ్యమైనంత తగ్గించాలి. బస్సులు, రైళ్లలాంటి ప్రజారవాణాను వినియోగించుకోవాలి. తక్కువ దూరాలకు నడిచో, సైకిల్‌పైనే వెళ్లాలి.
* రైతులు క త్రిమ ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులే వాడాలి. పురుగు మందులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.
* ఫ్రిజ్‌ల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ పొర క్షీణిస్తున్నది. తద్వారా అతి నీలలోహిత కిరణాలు భూమిని చేరి, జంతు, వృక్ష జాతులు నశిస్తున్నాయి. మానవుల్లో వ్యాధి నిరోధక శక్తి దెబ్బతింటున్నది. చర్మ సంబంధ క్యాన్సర్లతో మరణాలు సంభవిస్తున్నాయి. కనుక వీలైనంత వరకు ఫ్రిజ్‌లు, ఏసీల వాడకానికి దూరంగా ఉండడమే మంచిది.
* కొత్త బస్సులను ప్రవేశ పెట్టి వివిధ గ్రామాలకు నిర్ణీత సమయానికి అందుబాటులోకి తెస్తే ద్విచక్ర, త్రి చక్ర వాహనాలను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. ఈరకంగా చేస్తే వాహన కాలుష్యం తగ్గుతుంది. ప్రజలకు డబ్బు, ఇంధనం ఆదా అవుతాయి.
* గతంలో సంవత్సరంలో ఒకటి రెండు సార్లు దీపావళి లాంటి పండగలకు టపాసులు కాల్చేవారు. కానీ నేడు పండగలకు, పబ్బాలకు, పెండ్లిళ్లకు, పేరంటాలకు, ఎన్నికల విజయాలకు, ప్రమాణ స్వీకారాలకు, ప్రారంభోత్సవాలకు మొదలయిన అన్ని సందర్భాల్లో కాలుష్యాన్ని వెదజల్లే రకరకాల టపాసులు కాలుస్తున్నారు. టపాసుల వలన అనేక వేల మంది శ్రమ వృధా కావటమే కాకుండా ప్రమాదాలు జరుగుతు న్నాయి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరుగుతున్నది. కనుక టపాసులను సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే కాల్చటానికి అనుమతించాలి.
* రసాయనిక పరిశ్రమలు కాలుష్య కారకాలు. ఇటువంటి వాటికి తప్పనిసరి పరిస్థితులలో అనుమతి ఇవ్వవలసి వస్తే అందుకు తగిన భద్రతాచర్యలు చేపట్టాలి. రసాయన వ్యర్థాలను శుద్ధి చేసే యంత్రాల్ని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
* విద్యుత్తు ఉత్పత్తిలో హైడ్రో విద్యుత్తుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది చౌక. కాలుష్య రహితం. పరిశ్రమలు, వ్యవసాయం రెండు విధాల లాభం. బొగ్గును ఇంధనంగా వాడే ధర్మల్ విద్యుదుత్పత్తిని కాల క్రమేణా తగ్గించాలి. వాయుకాలుష్యం తగ్గుతుంది. బూడిద ద్వారా ఏర్పడే భూ కాలుష్యం, వాయు కాలుష్యం నివారించగలం. ఇందుకోసం ప్రత్యామ్నాయంగా పవన సౌర విద్యుత్తులను అధికం చేయాలి.
ఆరోగ్యానికి..
* ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దగ్గర్లో వ్యాయామం చేయొద్దు. అలాంటి పార్కులను ఎంచుకోవద్దు.
* ట్రాఫిక్‌లో వెళ్తున్నప్పుడు మాస్క్ ధరించండి.
* వీలైనంతవరకు నడిచి లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో వెళ్లండి.
* స్వచ్ఛమైన గాలి ఉన్నదనుకున్నప్పుడు యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయండి. దీనివల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.
* ఇంట్లోనే కాదు.. సాధ్యమయ్యే ప్రతిచోటా మొక్కలను పెంచండి.


Comments
Post a Comment