కూల్..కూల్‌గా... కాటన్ బెటర్
వేవికాలం అనగానే మనకు గుర్తొచ్చేది మండే సూర్యుడు.. కారిపోతున్న చెమటలు.. ఉక్కపోత.. చికాకు. కాలు బయట పెట్టాలంటేనే భయం.. ఇలాంటి సందర్భాల్లో ఎండ నుంచి తట్టుకునేందుకు కాటన్ దుస్తులు ఎంతో అనువైనవి. టీనేజ్ అబ్బాయిలు, అమ్మాయిల దగ్గర నుంచి ఉద్యోగస్తుల వరకు తమ అవసరాలకు, లుక్, టేస్ట్‌లకు అనుగుణంగా దుస్తుల వేట మొదలుపెట్టారు.
ఈ సీజన్లో నైలాన్, సింథటిక్, సిల్కు, నల్లని దుస్తులు వాడరాదు. ఎందుకంటే అవి చెమటను పీల్చుకోవు. దీంతో ఉష్ణోగ్రత అధికమై చర్మవ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. చిన్నారులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ.. కాటన్, ఖద్దర్, పలచగా ఉండి శరీరానికి గాలి తగిలే వస్తువులను వాడాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి.
రంగులద్దిన దుస్తులతో ప్రమాదం...
పిల్లలకు తల్లిదండ్రులు ఎక్కువ శాతం ఫ్యాన్సీ దుస్తులను వాడుతుంటారు. అయితే సీజన్ బట్టి పిల్లలకు దుస్తులను వాడాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా వేసవిలో ఫ్యాన్సీ దుస్తులు వాడితే చిన్నారులు పలు వ్యాధుల బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. నైలాన్, సిల్క్, నల్లని (బ్లాక్) వస్త్రాలు ఎండకు నిగనిగలాడుతుంటాయి. ఇలాంటి దుస్తులపై పిల్లలకు మోజు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి దుస్తులు సూర్యరశ్మిని అధికంగా గ్రహించి వడదెబ్బకు గురి చేస్తాయి. ఫంగస్ మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. వాస్తవంగా నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు పిల్లలు ఈ సీజన్లో ఎలాంటి దుస్తులు వాడాలో తెలియదు. పిల్లలు మారాం చేశారని, వారి ఇష్టప్రకారమే దుస్తులు వేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. డైపర్స్ (ప్యాంపర్స్) వంటి వాటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్చకుండా అలాగే ఉంచడం వల్ల శరీరం ఎర్రబారుతుంది. చర్మం కూడా దెబ్బతిని చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గ్జెల్లో ఫంగస్ వస్తుంది. మార్కెట్లో లభించే రకరకాల దుస్తులకు ప్రమాదకరమైన రంగులు అద్ది ఉంటారు. ఇవి అక్రిలిక్ పెయింటింగ్స్, కొన్ని రకాల సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో తయారై ఉంటాయి. వీటిని ధరించడం వల్ల స్కిన్ అలర్జీ వ్యాప్తి చెందుతుంది.
ఇలాంటి దుస్తులు వేస్తే మంచిది...
వేసవిలో శరీర రక్షణకు పలచని, కాటన్ దుస్తులు వాడటం చాలా మంచిది. ఈ దుస్తులు ఉష్ణోగ్రతను నియంత్రించి గాలిని ఇస్తూ శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుతాయి. చెమటలు పట్టకుండా చేస్తాయి. తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడతాయి. డిస్పోజల్ దుస్తులను పుట్టిన పిల్లలకు వేయడం మంచిది కాదు. వీటి కంటే వదులుగా ఉండే కాటన్ డ్రాయర్లు వేస్తే మంచిది. చల్లగా ఉండే కాటన్ టోపీలనే పిల్లలకు వాడాలి. దీని వల్ల పిల్లాడి తలకు ఎండ ప్రభావం పడదు. పిల్లల చేతులకు, కాళ్లకు సైతం కాటన్ తొడుగులు వేస్తే మంచిది. పిల్లాడికి రోజూ స్నానం చేయించి ఉతికిన దుస్తులను వేయాలి.
ప్రబలే వ్యాధులు...
ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్‌కు మారేటప్పుడు ఉష్ణోగ్రతకు అనుగుణంగా వైరస్ మారుతుంది. దీని ప్రకారం రోగనిరోధక శక్తి పెరగడానికి పట్టే సమయంలో వ్యాధులు చిన్నారుల దేహంపై సులభంగా దాడి చేస్తాయి. ఈ సమయంలో చిన్నారులు జలుబు, దగ్గు, గొంతునొప్పి, నిమోనియా వ్యాధి బారిన పడే అవకాశాలు అధికం. కలుషిత నీటి వల్ల వాంతులు, విరేచనాలు, అమీబియాసిస్, రక్త విరేచనాలు (డీసెంట్రీ), గ్యాస్ట్రో ఎంట్రైటీస్, టైఫాయిడ్, కామెర్లు వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. బ్యాక్టీరియా, వైరస్ వల్ల డయేరియా వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల విరేచనాలు అధికమయ్యే ప్రమాదం ఉంది. పిల్లలకు తట్టు (అమ్మవారు) ఎక్కువగా వస్తుంది. ఇది వైరస్వల్ల సోకుతుంది. జ్వరం, కళ్లు ఎర్రబడటం, చర్మంపై ఎర్రటి దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది నాలుగైదు రోజుల వరకు పిల్లలపై ప్రభావం చూపుతుంది. చికెన్‌ఫాక్స్ (పెద్ద అమ్మవారు) వ్యాపించిన రోజే ఎక్కువగా జ్వరం వస్తుంది. దేహంపై నీటి బుడగల్లాంటి పొక్కులు వస్తాయి. ఒళ్లంతా దురదగా ఉంటుంది. చాలా ప్రమాదకరమైంది. త్వరగా నివారించకపోతే నాడీ మండలం, శ్వాసకోశాలు, గుండెపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండటంతో పాటు సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో చెమట పొక్కులు వచ్చే ప్రమాదం ఉంది. ఫంగస్ ఏర్పడి ఇన్ఫెక్షన్ వస్తుంది.
ఫ్యాషన్ అంటే..
దుస్తులు ధరించడంలో సౌకర్యానికే. అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. వివిధ దేశాల్లోని వస్త్రధారణలను గమనిస్తే ఆయా వాతావరణాలకు అనుగుణంగా వాటి వేషాధారణ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతే మనిషికి వేషాధారణ నేర్పింది. ఆ వేషాధారణకు కొంత సృజనాత్మకతను జోడిస్తే అదే ఫ్యాషన్. ఈ విషయాలన్నీ పక్కనబెడితే, ఎండాకాలం స్పెషల్ ఫ్యాబ్రిక్ కాటన్. ఇది తెలియని వారు బహుశా లేరని చెప్పాలి. కాటన్ చెమటను పీల్చుకుని, శరీరానికి గాలి తగిలేలా చేస్తుంది. కంఫర్ట్‌గా ఉంటుంది. సౌకర్యం దృష్ట్యా, ఫ్యాషన్ దృష్ట్యా ఈ కాటన్ సమ్మర్లో అవసరం. అవి కూడా కాస్త లూజ్‌గా, మనకు సూటయ్యే విధంగా ఎంపిక చేసుకుంటే సౌకర్యంగానూ ఉంటుంది. ఫ్యాషన్బుల్గానూ ఉంటుంది. ప్రతి సీజన్లోనూ చెక్కుచెదరని క్రేజీ దీనిలో ఉండే విశేషం.
కాటన్ దుస్తులకు భలే గిరాకీ
ప్రస్తుతం మార్కెట్లో కాటన్ దుస్తుల సందడి నెలకొంది. సమ్మర్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు కాటన్‌కు సంబంధించిన రకరకాల వస్త్రాలను అమ్ముతున్నారు. చీరల దగ్గర నుంచి నైటీలు, కాటన్షర్టులు, చిన్నపిల్లల దుస్తులు, బాబ్సూట్స్ వంటివి విక్రయిస్తున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిన్నచిన్న వ్యాపారుల దగ్గర నుంచి పెద్దషాపుల వారు అన్ని వయసుల వారికి అవసరమైన కాటన్ చీరలు, వస్త్రాలను అమ్ముతున్నారు. కాటన్ చీరలు రూ.100-200లకు లభ్యమవుతున్నాయి. వీటిలో ఫ్యాన్సీరకం చీరలు కూడా ఉన్నాయి. ఇక నైటీలకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. మహిళలు కాటన్ నైటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికనుగుణంగా వివిధ కంపెనీలు రకరకాల డిజైన్లతో మార్కెట్లోకి దించాయి. నాణ్యత, డిజైన్లను బట్టి ధరలు పలుకుతున్నాయి. రూ.100-250 వరకు విక్రయిస్తున్నారు. ఇక యువకులకు వివిధ రాష్ట్ర కాటన్ షర్టులు, ఫ్యాంట్లు, నైట్ డ్రస్‌లు, టీషర్టులు విక్రయి స్తున్నారు. యువతులు, మహిళలు ఇటీవల పంజాబ్ దుస్తులను వినియోగిం చటంతో రెడీమేడ్ సంస్థలు వివిధ అనువైన కాటన్ పంజాబ్ డ్రెస్‌లను ఎక్కువగా విక్రయిస్తున్నారు.
వేసవిలో అనుక్షణం జాగ్రత్తలు పాటించాల్సిందే...
ఈ కాలంలో మధ్యతరగతి, సామాన్య జనం సూర్యతాపానికి విలవిల్లాడుతుంటారు. ముఖ్యంగా వేసవి మనకి చిరాకు కలిగించేవి బట్టలే. గాలిలేక ఎండకు చెమటలు పోసి, ఉక్కపోతగా ఉంటుంది. దానికి తగ్గట్టు సరైన వస్త్రధారణ లేకపోతే మరింత చికాకు కలిగి, శరీరమంతా జిడ్డుదేలి, రోజుకు మూడుసార్లైనా స్నానం చేయాలనిపిస్తూ ఉంటుంది. అందుకే వస్త్ర విశేషం గురించి తెలుసుకుంటే ఈ బాధ నుంచి కొంత విముక్తి పొందొచ్చు. సాధారణంగా వేసవి అనగానే కాటన్ దుస్తులే అందరూ వాడుతుంటారు. ఇవి ఒంటికి చెమటను పీల్చి, చల్లదనాన్ని అందిస్తాయి. అయితే ప్యూర్ కాటన్ వస్త్రాలు మాత్రమే వాడటం మంచిది. కాటన్ మిక్చర్ వాడటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కాస్త ఖరీదెక్కువైనా కాటన్ దుస్తులు ఒక్కటి రెండు జతలు ఈ వేసవికి కొనుక్కుంటే మంచిది. ఇవి శీతాకాలంలో వెచ్చదనాన్ని కూడా ఇస్తాయి.
పాటించాల్సిన జాగ్రత్తలు...
* ఇక ఇంటి వద్ద ఉండేవాళ్లు వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. పిల్లలకు వేసే జుబ్బాలు, లంగోటీలు కూడా వీలైనంత వరకు రోజు ఆరవేస్తూ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటే చంటి పిల్లలు చక్కగా ప్రశాంతంగా ఉంటారు.
* మనం వేసుకోబోయే దుస్తుల్లో ముందుగా టాల్కం పౌడర్ చల్లుకుని వేసుకుంటే చెమట వల్ల కలిగే దుర్వాసన ఆపుతుంది. వేసవిలో సాధ్యమైనంత
* ఖద్దరు పైజామా, కుర్తాలు ఫ్యాషనైపోయాయి. పైజామాలు నేడు జీన్స్‌ని మించి అమ్ముడుపోతున్నాయి. అందుచేత ఎండాకాలంలో ఖద్దరు దుస్తుల్ని వాడటం మంచిది.
* ఖద్దరు ప్రకృతి సహజమైనవి. కాబట్టి చర్మానికి మేలు. చెమట పోయదు. గాలి బాగా తగులుతుంది. శరీరం నుంచి వాసన రానివ్వదు.
* సింథటిక్ ఫ్యాబ్రిక్ కొందరికి పడదు ఎలర్జీతో వచ్చే ర్యాష్ సమస్య ఖద్దరుతో ఉండదు. ఇది ఏ సీజన్లో అయినా, ఎటువంటి వాతావరణంలోనైనా ధరించవచ్చు.
* గర్భిణులు వీలైనంతమేరకు వదులు దుస్తులనే ధరించాలి. అవికూడా మెత్తగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఈ దుస్తుల్లో లైట్ కలర్ దుస్తులు అయితే ఎంతో మంచిది. డార్క్ కలర్ దుస్తులు త్వరగా వేడిని గ్రహిస్తాయి.
* కాటన్ లేదా లెనిన్ దుస్తులు చెమటను సులభంగా గ్రహిస్తాయి, ఎండ తీవ్రతను ఎదుర్కోవడానికి సహాయపడతాయి కాబట్టి వీలైనంత వరకు వాటినే ధరించాలి.
* ఎండలో వెళ్ళడం తప్పదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా స్కార్ఫ్‌ను కానీ, గొడుగు కానీ ఉపయోగించాలి.
* పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే లేత రంగు దుస్తులు మంచిది. వీటిలో లేత నీలం, లేత గోధుమ రంగు, లేత గులాబీ రంగులైతే మరీ మంచిది. సాయంత్ర వేళలో నారింజ, ముదురు నీలం, చాక్లెట్ బ్రౌన్ రంగులు ఎంపిక చేసుకోవచ్చు. ఇక.. 'సీ గ్రీన్' రంగు దుస్తులైతే ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు. వేసవి దుస్తులు మరీ వదులుగా లేక బిగుతుగా లేకుండా తగినట్లు ఉండాలి. దీనివల్ల శరీరానికి గాలి తగిలి చెమట పట్టటం తగ్గటమే గాక పట్టిన చెమటను దుస్తులు ఎప్పటికప్పుడు పీల్చుకోవటం సాధ్యమవుతుంది. నిర్వహణ కాస్త కష్టమనిపించినా వేసవిలో మెత్తని నూలు వస్త్రాల ఎంపిక మంచిది. డ్రెస్ కోడ్ పాటించే వారు సైతం కాటన్ జీన్స్, షర్టులు ఎంపిక చేసుకోవచ్చు.
* మహిళలు ఏ డిజైన్ లేని సాదా దుస్తులను ఇష్టపడరు గనుక వారు ప్రింటెడ్ కాటన్ దుస్తులు ఎంపిక చేసుకోవాలి. ఇలాంటివారికి పగటి ఎండధాటికి నిలిచి, చెమటను పీల్చుకొనే లినన్ కాటన్, ఆర్గంజ, వంటివి మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అదే.. సాయంత్రం వేళ కశ్మీరీ సిల్క్, మట్క సిల్క్, క్రేప్ సిల్క్ వంటివైతే సౌకర్యంగా ఉండటంతో బాటు అందంగానూ కనిపిస్తారు.
Comments
Post a Comment