మార్చి మొదటి వారానికే ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపం రోజురోజుకూ తీవ్రమవుతోంది. 10 రోజులుగా పెరిగిన ఎండలతో జనం 'ఉక్క'రిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటలకే సుర్రుమనిపించే సూరీడు.. మధ్యాహ్నానికి చండిపచండంగా మారుతున్నాడు. ఈ ఎండవేడిమి తట్టుకోలేక చాలా మంది బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సిన వారు ఎండకు తాళలేక శీతల పానీయాలను (కూల్‌డ్రింక్స్‌ను) సేవిస్తున్నారు. పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగ, అంబలి, సోడా తదితరాలతో సేదతీరుతున్నారు. తద్వారా కాసింత ఉపశమనం పొందుతున్నారు. వడదెబ్బ బారినపడకుండా వీటిని తాగుతూ ప్రజలు జాగ్రత్త పడుతున్నారు.
కొబ్బరి బోండాలకు గిరాకీ...
కొబ్బరిబోండాలకు గిరాకీ పెరిగింది. కొబ్బరి నీటిలో మంచి లవణాలు ఉన్నందున ఎక్కువ మంది వీటిని తాగేందుకు ప్రాధాన్య తనిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా కాపాడటంలో కొబ్బరి నీరు ప్రధాన పాత్ర పోషిస్తోంది. కేరళతో పాటు, చిత్తూరు, కడప, నెల్లూరు, వరంగల్ జిల్లాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. కొబ్బరి నీటిని తాగితే శరీరంలో కోల్పోయిన కార్పోహైడ్రేట్‌లు తిరిగి భర్తీ అవుతాయి. బడలికతో ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఎంతో శ్రేయస్కరం.
జ్యూస్‌ల జోరు...
జ్యూస్‌లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగు తుందని ఆయుర్వేద వైద్య నిపుణు లు అంటున్నారు. గొంతు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో పట్టణంలోని కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తాలలో ప్రత్యేకంగా జ్యూస్ సెంటర్లు వెలిశాయి. ఇందులో ఆరెంజ్, సపోటా, అరటి, పైనాపిల్, ఆపిల్, దానిమ్మ, గ్రేప్ తదితర జ్యూస్‌లను తయారు చేసి విక్రయిస్తున్నారు. గ్లాస్ జ్యూస్‌ను రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.
పుచ్చకాయల జ్యూస్...
వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడపడితే అక్కడ పుచ్చకాయలు దర్శనమిస్తాయి. దీన్ని ముక్కలుగా తినడంతో పాటు, జ్యూస్‌గానూ తయారు చేసి తాగొచ్చు. రక్తపోటు నివారణకు దోహదప డుతోంది. శరీరానికి అవస రమైన నీటి శాతాన్ని అంది స్తుంది. ఎండ లకు శరీ రంలో తగ్గేనీటిని వీటితో భర్తీ చేసుకోవచ్చు.
దాహర్తి తీర్చే
గోలీ సోడా..
చిన్న తోపుడు బండ్లపై గ్యాస్ బండతో కనిపించే గోలీ సోడా తాగితే ఎండ దెబ్బనుంచి తక్షణం ఉపశమనం పొందవచ్చు. ఇవి స్వీట్, సాల్ట్ క్రష్‌లలో లభ్యమవుతున్నాయి. సోడాకు నిమ్మరసం జత చేసి తయారు చేస్తారు. గ్లాస్ గోలీ సోడా ధర రూ. 5 నుంచి రూ. 10 వరకు విక్రయిస్తున్నారు. వాంతులు, కడుపులో ఉబ్బసానికి బాగా పని చేస్తోందని వైద్యులు చెబుతున్నారు.
కుండ లస్సీ...
జిల్లాలో చాలా చోట్ల కుండ లస్సీ అమ్మకాలు పెరిగాయి. పెరుగుతో తయారు చేసే లస్సీ తాగితే శరీరానికి చక్కటి కాంతితో పాటు ఎండ నుంచీ ఉపశమనం పొందవచ్చు. లస్సీని కుండలో నిల్వపెట్టి మిక్సీలో వేసి చిలకరించి క్యారెట్, కొబ్బరి, చెర్రీతో పాటు మీగడ జత చేసి ఇస్తున్నారు. వేసవి దృష్ట్యా పలుచోట్ల ప్రధాన కూడళ్లలో కుండ లస్సీని బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు.
భలే రుచి... చెరకు రసం...
సీజన్‌తో తేడా లేకుండా చెరకు రసాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. రాములవారి గుడి, భవానీనగర్, స్విమ్స్ సర్కిల్, తిలక్ రోడ్డు లీలామహాల్ ప్రాంతాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఎండలో తిరిగే వారికి శరీరంలో గ్లూగోజ్ శాతం తగ్గి నీరసం వస్తుంది. అలాంటప్పుడు చెరకు రసాన్ని తాగితే నీరసం తగ్గి మళ్లీ ఉత్సాహం వస్తుంది. అలాగే.. సుగంధ ద్రవ్యాల జ్యూస్‌కూ గిరాకీ ఉంది. శరీరానికి మంచి గుణాలు కలిగిన జ్యూస్ ఇది. వడదెబ్బకు బాగా పని చేస్తుంది.
తాటి ముంజె
వేసవిలో మాత్రమే దొరికేది తాటి కాయ ఒకటి. ఇది కూడా ప్రకృతి ప్రసాదమేనని చెప్పాలి. ఎండాకాలంలో చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ముఖ్యంగా తాటి ముంజె వేసవికి శ్రేష్టమైనది. తాటి ముంజె పైపొర చాలా మంది తీసివేసి లోపలి తెల్లటి పదార్థాన్ని మాత్రమే తింటారు. పైపొర తింటే అరుగుదల ఉండదనేది అపోహ. అయితే ఈ పైపొరలోనే ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ఇక లోపలి తెల్లటి పదార్థం ఎండ తాపం నుంచి రక్షణ కల్పిస్తుంది.
మండుటెండలో
మజ్జిగతో ఉపశమనం..
ఎండలు మండే ఈ కాలంలో మధ్యాహ్నం బయటకు తిరిగేవారు.. తిరిగి తిరిగి వచ్చిన వారు ఓ గ్లాసుడు చల్లని మజ్జిగ తాగితే ఎంతో మేలు. దేహానికి మజ్జిగ చేసే మేలు అంతాఇంతా కాదు. పేగులకు పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లి వంటి పదార్థాలు ఇందులో ఉంటాయి. విరో చనాలు, వాంతులు, అధిక దాహం వంటి సమస్యలు లేదా నీరసం, కాళ్లు చేతులు తిమ్మిర్లు తలెత్తినప్పుడు మజ్జిగలో ఉప్పుకానీ, పంచదార కానీ వేసుకుని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. మజ్జిగ విక్రయానికి ప్రత్యేకంగా సెంటర్లు ఏర్పడ్డాయి. రూ.10కి గ్లాసు చొప్పున విక్రయిస్తున్నారు.
చలివేంద్రాల కోసం నిరీక్షణ...
ఎండలు మండి పోతుండటంతో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. డబ్బు చెల్లించి నీరు కొనుగోలు చేసి తాగాల్సి వస్తోంది. ఎక్కడ చలి వేంద్రాలు ఉన్నాయా అని అన్వేషిస్తున్నారు. లేని చోట వాటిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. వేసవికి ముందే ఎండలు ముదరడంతో మున్సిపల్, కార్పొరేషన్ యంత్రాంగం ఇప్పటికే చలి వేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు లేవు.
5 లీటర్లకుపైగా నీరు తాగండి...
వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు ఐదు లీటర్లకుపైగా నీరు తాగాలి. అది జూస్‌ల రూపంలో గానీ, పండ్లు తినడం ద్వారాగానీ, సాధారణ నీరు తాగడం ద్వారా గానీ చేయవచ్చు. వేసవిలే నీరు తక్కువగా తాగడం వలన మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎండకాలం తరుచుగా నీరు తాగుతూ ఉండాలి. కూల్‌డ్రింగ్స్ కంటే పండ్ల రసాలకు ఎక్కువ ప్రధాన్యత ఇవ్వాలి. కూల్‌డ్రింక్స్‌్‌లలో పురుగు మందులు ఉండటంతో కిడ్నీ సంబంధిత రోగాలు రావచ్చు. పండ్ల రసాలు కూడా ఇళ్లలో తయారు చేసుకుని తాగితే మరీ మంచిది
Comments
Post a Comment