పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత.. ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆదర్శంగా నిలుస్తోంది తాంసి మండల కేంద్రం.. పరిశుభ్రత.. భూగర్భ జలాలు పెంచాలనే ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు ముందుకేస్తోంది. ప్రభుత్వం అందించే పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటోంది.
తాంసి మండల కేంద్రంలో సుమారు 950 కుటుంబాలు నివాసముంటుండగా, 5800 జనాభా ఉంది. కొన్నేండ్ల క్రితం వరకు చూసినట్లయితే ఆర్థికంగా బలంగా ఉన్న వారు, ప్రభుత్వ కొలువు ఉన్న కుటుంబాల్లో తప్ప ఇతరుల ఇండ్లలో మరుగుదొడ్లు కనిపించేవి కావు. సుమారు 75 శాతం మంది ఇండ్లలో మరుగుదొడ్లు ఉండేవి కావు. దీంతో గ్రామంలో అపరిశుభ్రత నెలకొంది. ముఖ్యంగా మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. రోడ్లపై వచ్చిపోయేవారు దుర్వాసనతో ముక్కును మూసుకునే వారు. దుర్వాసనతో కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. అయితే మూడేండ్ల క్రితం ఎంపీడీఓ ఆకుల భూమయ్య, ఉపాధి హామీ ఏపీఓ సంగీత, బీఎస్ఎన్ఎల్ డీఈ అశోక్ వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. బహిరంగ మలమూత్ర విసర్జనతో కలిగే నష్టాలను వారికి వివరించారు. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇప్పుడు ఇంటింటా మరుగుదొడ్డి
మూడేండ్ల కాలంలో తాంసిలో ఇప్పుడు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కనిపిస్తుంది. ఈ ఫలితం వెనక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన సంఘ సభ్యుల విశేష కృషి ఉంది. ఆర్థిక పరిస్థితి సహకరించని కుటుంబాలకు బీఎస్ఎన్ఎల్ అధికారి అశోక్ మరుగుదొడ్డి కావాల్సిన వస్తువులను ఇచ్చి నిర్మాణాలు చేయించారు. గతంలో ఐకేపీ అధికారుల సర్వే ప్రకారం 950 కుటుంబాలు 120 మాత్రమే మరుగుదొడ్లు ఉండగా, 2010-12 సంవత్సరాల్లో ఆర్డబ్ల్యూఎస్ కింద మరో 70 మంది మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. నిర్మల్ అభియాన్ కింద ఉపాధి హామీ ద్వారా మరో 236 మంది మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి ఆయా పథకాల కింద ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. మండల కేంద్రంలో మరో 10 మరుగుదొడ్లు నిర్మించుకుంటే వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామంగా తాంసి మండల కేంద్రం నిలవనుంది.
ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు
మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా, భూగర్భ జలాలు పెరిగేలా ఇంటి పరిసరాల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకుంటున్నారు తాంసి మండల కేంద్రవాసులు. సర్పంచ్ గుమ్మడి భాగ్యమ్మ ప్రత్యేక శ్రద్ధతో గ్రామంలోని 16 బోరుబావుల వద్ద ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు తవ్వించారు. ఈఓపీఆర్డీ భిక్షపతిగౌడ్ పంచాయతీ కార్యదర్శి హరిత, వార్డు సభ్యులు గ్రామస్తులకు ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలను వివరించి సుమారు వంద ఇండ్ల ఆవరణలో ఇంకుడు గుంతలు తవ్వించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఇటీవల కలెక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గ్రామంలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను పరిశీలించి గ్రామస్తులతోపాటు సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులను అభినందించారు.
పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలి. ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భజలాలు పెంచేందుకు తొడ్పడుతుంది. మండల కేంద్రంలో మరో పది మంది మరుగుదొడ్లు నిర్మించుకుంటే వంద శాతం మరుగుదొడ్లు ఉన్న గ్రామంగా తాంసి నిలుస్తుంది. తాంసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.
-ఎంపీడీఓ భూమయ్య
గ్రామస్తుల చైతన్యంతోనే సాధ్యం
గ్రామస్తులు చైతన్యవంతులైనందుకే మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాల్లో ఆదర్శంగా నిలుస్తుంది. దీని వెనక వార్డు సభ్యులు, అధికారుల కృషి విశేషంగా ఉంది. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణ ఆవశ్యకతను ప్రజలకు వివరించడంలో సఫలీకృతమయ్యాం. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం.
-సర్పంచ్ భాగ్యమ్మ
Comments
Post a Comment