ఆదిలాబాద్ జిల్లా కేంద్ర ప్రజల పిక్నిక్ స్పాట్ కళ తప్పింది. ఆహ్లాదం కోసం పట్టణ ప్రజలు వెళ్లే సాత్నాల ప్రాజెక్టులో పచ్చదనం కరువైంది. పర్యాటకులు లేక బోసిపోతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. దీంతో పర్యాటకుల తాకిడి తక్కువైంది.
ఒకప్పుడు జైనథ్ మండలంలో సాత్నాల ప్రాజెక్టు ఆహ్లాదానికి పెట్టింది పేరు. రెండు దశాబ్దాలకు పైగా ప్రజలు ఇక్కడ పిక్నిక్కు వెళ్లేవారు. ఎవరైనా రాజకీయ నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ కాసేపు సేద తీరేవారు. పిక్నిక్కు వెళ్లినప్పుడు చిన్న పిల్లల కేరింతలతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రాజెక్టుకు వద్ద పచ్చదనం కరువైంది. పర్యాటక శాఖ ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కల్పించకపోవడంతో క్రమేపి సాత్నాల ప్రాజెక్టు అంటే పర్యాటకులకు పూర్తిగా ఆసక్తి తగ్గింది. దీంతో ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారుతోంది. ప్రాజెక్టు వద్ద పచ్చదనానికి బదులు పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అప్పుడప్పుడు ఎవరో ఒకరు సాత్నాల ప్రాజెక్టుకు ఆహ్లాదం కోసం వెళ్తున్నారే తప్ప పర్యాటకుల తాకిడి పూర్తిస్థాయిలో తగ్గిపోయింది.
సౌకర్యాలు కల్పిస్తే ఆదరణ
జిల్లాకు తలమానికమైన సాత్నాల ప్రాజెక్టు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. దీంతో ప్రకృతి ప్రేమికులు తరచూ వచ్చే అవకాశం ఉంటుంది. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రాజెక్టుకు మరింత శోభ వస్తుంది. సాత్నాల ప్రాజెక్టు జిల్లా కేంద్రం నుంచి 18 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఎత్తయిన గుట్టలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. కాగా మంత్రి జోగురామన్న నియోజకవర్గంలో ఉన్న సాత్నాల ప్రాజెక్టు అభివృద్ధి కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Post a Comment