టీకా ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచి రోగాలు రాకుండా కాపాడుతుంది. ప్రభుత్వం అన్ని ఆస్పత్రుల్లో అన్ని రకాల టీకాలను ఉచితంగా అందిస్తోంది. ముఖ్యంగా పెద్దలకు టీకాలపై అవగాహన ఎంతో అవసరం. ఈ టీకాలు చిన్నారులకు క్షయ, కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, తట్టు, కామెర్లు, మెదడువాపు, హిబ్ (న్యూమోనియా) వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడాన్నే టీకా (వ్యాక్సిన్) అంటారు. రేపు జాతీయ టీకాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
టీకా లేదా వ్యాక్సిన్ అనేది ఒక నివారణ మందు. వ్యాధి కారకం శరీరంలోకి చేరకముందే దీన్ని ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో సంక్రమించే అవకాశమున్న వ్యాధికారక నిరోధాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు. కేవలం చిన్న పిల్లలే కాకుండా పెద్దలు కూడా వేయించుకునే టీకాలు ఉన్నాయి. సాధారణంగా టీకాలు రెండు రకాలు ఒకటి సంప్రదాయక, రెండోది ఆధునిక టీకాలు. సంప్రదాయక టీకాల్లో క్షీణింపజేసిన లేదా మృత వ్యాధి కారకాలు ఉంటాయి. ఈ టీకాలను అందించటం ద్వారా వ్యాధి అభివృద్ధి చెందదు. అయితే వ్యాధి కారక ఉపరితలంపై ఉన్న ప్రతిజనకానికి విరుద్ధంగా శరీరంలో ప్రతిదేహకాలు విడుదలై మెమొరీ అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి టీకాలను రెండు/మూడుసార్లు వేయిస్తే శరీరంలో వ్యాధికి విరుద్ధంగా పూర్తిస్థాయి నిరోధకత లభిస్తుంది.
చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు
'0' డోసు : పుట్టిన వెంటనే శిశువుకు 24 గంటల్లోపు '0' డోసు ఓపీవీ బీసీజీ హెపటైటీస్-బీ టీకాలు ఇవ్వాలి. నోటి ద్వారా రెండు పోలియో చుక్కలు వేయడం ద్వారా చిన్న పిల్లలో వచ్చే పోలియో వ్యాధి నుంచి జీవితాంతం రక్షణ ఉంటుంది.
బీసీజీ : బిడ్డ పుట్టిన వెంటనే ఎడమ భుజానికి 0.05 ఎంఎల్ చర్మంలోనికి ఇచ్చే సూది మందు. దీని వల్ల చిన్న పిల్లలో వచ్చే ఊపిరితిత్తులు, మెదడు, ఇతర అవయవాలను టీబీని నివారించవచ్చు.
హెపటైటీస్ 'బీ' : బిడ్డ పుట్టిన వెంటనే 24 గంటలలోపు 0.05 ఎంఎల్ తొడ వెలుపలి భాగంలోని కండరానికి ఇవ్వాలి. దీని ద్వారా చిన్న పిల్లలలో కామెర్ల వ్యాధి, పెద్ద వయస్సులో వచ్చే లివర్ సంబంధిత సిర్రోసిస్ క్యాన్సర్లను నివారించవచ్చు.
రోటా వైరస్: పుట్టిన 6, 10, 14 వారాలల్లో నోటి ద్వారా 5 చుక్కలు ఇవ్వాలి. ఈ టీకా వల్ల రోటా వైరస్ వల్ల కలిగే విరేచనాల నుంచి రక్షిస్తుంది. ఆస్పత్రిలో చేరి సెలైన్ ఎక్కించుకోవాల్సిన అవసరాన్ని, పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చు.
పెంటావాలెంట్ టీకా : ఇది అత్యంత ప్రధానమైన టీకా. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ టీకా అందుబాటులో ఉంది. ఈ టీకా అయిదు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. బిడ్డ పుట్టిన 6, 10, 14 వారాల్లో 0.05 ఎంఎల్ ఎడమ తొడ వెలుపలి భాగంలో కండరంలోనికి ఇస్తారు. ప్రధానంగా 5 వ్యాధులు డిప్తీరియా (కంఠసర్పి), పర్‌ట్యూసిస్ (కోరింత దగ్గు), టెటానస్ (శిశుపక్షవాతం), హెపటైటీస్-బీ (కామెర్లు), హీమోఫీలస్ ఇన్‌ఫ్లూఎంజా టైప్-బీ (న్యూమోనియా, మెదడువాపు, చెవిటితనం) రాకుండా నివారిస్తుంది. సంవత్సరంలోపు పిల్లలకు మాత్రమే ఈ టీకా ఇవ్వాలి.
9 నెలలకు మీజిల్స్ (తట్టు) టీకా : 9 నెలలు నిండిన చిన్నారులకు మీజల్స్ (తట్టు) టీకా 0.05 ఎంఎల్ కుడి భుజం చర్మం కిందనున్న కొవ్వు పొరలోనికి ఇవ్వాలి. ఈ సూది ద్వారా పిల్లలను తట్టు నుంచి కాపాడవచ్చు.
విటమిన్ 'ఏ' ద్రావణం : విటమిన్ 'ఏ' ద్రావణం 1, 2, 5 సంవత్సరాల వరకు ప్రతి ఆర్నెల్లకు ఒకసారి మొత్తం తొమ్మిది డోసుల వరకు 2 ఎంఎల్ బిడ్డకు నోటి ద్వారా అందించాలి. దీని వల్ల చిన్న వయస్సులో వచ్చే శ్వాసకోశ వ్యాధులు (జలుబు, దగ్గు, నిమ్ము), జీర్ణకోశ వ్యాధులు (విరేచనాలు), కంటి వ్యాధులు (రేచీకటి), చర్మవ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.
18 నెలలకు అదనంగా ఇచ్చే టీకా (బూస్టర్ డోసు) : 16-24 నెలలోపు ఓపీవీ, డీపీటీ-1, మీజల్స్-2, జేఈ-2, విటమిన్ 'ఎ' ద్రావణం ఇవ్వాలి.
5 సంవత్సరాలకు డీపీటీ సూది తప్పనిసరిగా తుంటి వెలుపలి భాగంలోని కండరాల్లోకి ఇవ్వాలి. 10, 16 సంవత్సరాల పిల్లలకు టీటీ సూది భుజంలోని కండరాల్లోకి ఇవ్వాలి.
వ్యాక్సినేషన్‌పై అవగాహన
* తల్లిదండ్రులు విధిగా డాక్టర్లను సంప్రదించి పిల్లలకు వేయించాల్సిన కచ్చిత, ఐచ్చిక టీకాలపై అవగాహన పెంచుకోవాలి.
* ప్రభుత్వం అందించే టీకాలు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచిస్తున్న కచ్చిత, ఐచ్చిక టీకాల ఆవశ్యకతపై తల్లిదండ్రులకు డాక్టర్లు అవగాహన కల్పించాలి.
టీకా కార్డులో సూచించిన విధంగా ఎప్పటికప్పుడు టీకాలు వేయించాలి.
* టీకా వేసిన వైద్య వాలంటీర్ కార్డులో గుర్తుపెట్టి మళ్లీ ఎప్పుడు టీకా వేయించాలన్నది తల్లిదండ్రులకు తెలియజేయాలి.
* జ్వరం, దగ్గు, జలుబులు ఉన్నప్పుడు టీకాలు వేయించరాదు. తగ్గిన తర్వాత వేయించాలి.
* ఏ కారణం చేతైనా టీకాలు వేయించడంలో అవాంతరం ఏర్పడితే, మళ్లీ వైద్యుణ్ని సంప్రదించి కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసుకోవాలి.
* కేవలం పిల్లలకే కాదు పెద్దలకు కూడా వేయించాల్సిన టీకాలు ఉంటాయి.
* సాధారణంగా ఒకే రోజు ఎన్ని టీకాలైనా పిల్లలకు ఇవ్వొచ్చు. అయితే మళ్లీ 4 వారాల వరకు టీకాలు ఇవ్వకూడదు. పల్స్ పోలియో కార్యక్రమం, రేబిస్ టీకాలకు ఈ షరతు వర్తించదు.
* టీకా వేయించిన తర్వాత అర గంట వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దే వేచి ఉండాలి. ఎలాంటి ప్రతీకార చర్య కన్పించినా వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.
* అన్ని టీకాలు ప్రతీకార చర్యలకు కారణం కావు. అందరి పిల్లల్లో ప్రతీకార చర్యలు ఒకేవిధ ంగా ఉండవు. ప్రతీకార చర్య కనిపించినంత మాత్రానే టీకా పనిచేసినట్టు కాదు.
* కొత్తగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చిన పెంటావలెంట్, టెట్రావలెంట్‌ల కాంబినేషన్ వ్యాక్సిన్‌లపై అవగాహన పెంపొందించుకోవాలి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభించే టీకాలు
ఓపీయూ : పోలియో నివారణకు
హెచ్‌బీ : కామెర్లు రాకుండా
బీసీజీ : క్షయ వ్యాధి నివారిణి
రోటా వైరస్ : డయేరియాను అరికడుతుంది
పెంటావాలెంట్ : డిప్తీరియా, కామెర్లు రాకుండా కాపాడుతుంది.
మీజిల్స్ : తట్టు నుంచి రక్షణకు
టీటీ : ధనుర్వాతం
డీపీటీ : టెటానస్
విటమిన్-ఏ ద్రవం : దీని ద్వారా రే-చీకటిని నిర్మూలించవచ్చు
Comments
Post a Comment