ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి.. ఆరుగాలం శ్రమించి.. పంట పండించిన అన్నదాతకు ఏదీ కలిసి రావడం లేదు. రైతులకు అడుగడుగునా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న పెట్టుబడులు.. ప్రకృతి వైపరీత్యాలు కొన్నేండ్లుగా రైతులను డీలా పడేశాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తూ వ్యవసాయాన్ని లాభదాయం చేసుకుంటున్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖల ప్రోత్సాహంతో తమ చుట్టూ లభ్యమవుతున్న వ్యర్థాలు, పశువుల పేడ, వానపాములను ఉపయోగించుకొని వర్మీ కంపోస్ట్ తయారు చేస్తూ సాగు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు, భూసారం పెంచుకోవడం, అధిక దిగుబడులతో స్ఫూర్తిదాయక వ్యవసాయం సాగిస్తున్నారు.
రైతులు అవగాహన లేక అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీంతో సాగు ఖర్చులు పెరుగుతున్నాయే కానీ ఆశించిన దిగుబడులు రావటం లేదు. విచక్షణారహితంగా రసాయన ఎరువులు వినియోగించటం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులు తగ్గుతాయని గమనించిన రైతులు వినూత్న సాగు పద్ధతులపై దృష్టి పెట్టారు. భూసార పరిరక్షణ దృష్ట్యా సేంద్రియ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాగిస్తున్నారు.
ఆదర్శం ఈ రైతులు
ఆదిలాబాద్ మండలంలోని అనుకుంట గ్రామానికి చెందిన అడ్డూరి ఆశన్న, జైనథ్ మండలంలోని పార్డి గ్రామానికి చెందిన మంచాల గంభీర్ సేంద్రియ వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పొలాల వద్దే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు అధిక దిగుబడులు వస్తున్నాయి. స్థానికంగా లభ్యమయ్యే వ్యర్థపదార్ధాలు, పశువుల పేడను ఉపయోగించుకొని వర్మీకంపోస్ట్ తయారు చేస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వర్మీకంపోస్ట్ (హచర్)ను సద్వినియోగం చేసుకుంటున్నారు. యూనిట్ మొత్తం ధర రూ.లక్ష కాగా, సబ్సిడీ రూ.75 వేలు వచ్చినట్టు రైతులు తెలిపారు. పొలం వద్దనే కుండీలు తయారు చేసుకొని అందులో ఎర్రలను పెంచుతున్నట్టు తెలిపారు. ఆ కుండీల్లో తుక్కు, కందికుటర్, సోయాకుటర్, పత్తి కట్టె తుక్కు, చెత్తాచెదారం వేస్తున్నామని, దీంతో పదిహేను రోజుల్లో సేంద్రియ ఎరువు తయారవుతుందని చెబుతున్నారు. వేసవి కాలంలో ఆ ప్రాంతం చల్లగా ఉండేటట్లు చూసుకుంటే ఎరువు మంచిగా ఉంటుందన్నారు. కూరగాయలు, పండ్ల తోటలు, పత్తి, సోయా, శనగ, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలకు ఈ ఎరువు వాడుకోవచ్చని తెలిపారు. ఆవుమూత్రంతో జీవామృతటం తయారు చేయవచ్చని తెలిపారు. పురుగు మందుల కంటే ఇది ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని తెలిపారు.
వర్మీకంపోస్టు తయారీ విధానం
కుళ్లిన వ్యవసాయ వ్యర్థాలను ఆహారంగా తీసుకొని వానపాములు వర్మీ కంపోస్టు తయారుచేస్తాయి. కుండీల్లో తయారైన కంపోస్టు సేకరించిన తర్వాత మరోసారి తయారు చేయాలి. అలా చేయాలంటే వానపాములు సమృద్ధిగా ఉండాలి. అనుకూల వాతావరణంలో వానపాములు వేగంగా పెరుగుతాయి. ఎలుకలు, తొండలు కప్పలు, పాములు, పందులు, చీమలు వంటి సహజ శత్రువుల నుంచి రక్షణ ఏర్పాట్లు తప్పని సరి. ఇంకా వానపాములను వేగంగా వృద్ధి చేయాలంటే 'సీడ్' తయారీపై ద ష్టి పెట్టాలి. వర్మీకంపోస్టు తయారీ విధానం సుభమమే అయినా 'సీడ్' తయారీ మాత్రం శ్రద్ధతో చేయాల్సిన పని. నాలుగు కుండీల్లో వర్మీకంపోస్టు తయారు చేసే రైతులు వీటిలో కొంత భాగాన్ని సీడ్ తయారీకి వాడుకోవచ్చు. కంపోస్టు తయారీకి కుండీల్లో రెండు, మూడు అంగుళాల మేర ఎండిన డోక్కల, కొబ్బరి పొట్టు లాంటివి వేయాలి. దీనినే వర్మీ బెడ్ అంటారు. సాధారణంగా ఈ వర్మీబెడ్‌పై కుళ్లిన వ్యర్థాలు, మగ్గిన పేడ లాంటి వాటితో బెడ్ మొత్తం నింపి, గోనెలు కప్పి ప్రతీరోజు క్యాన్‌తో తడిపితే వర్మీకంపోస్టు తయారువుతుంది. దీనిని రెండు రోజులు ఆరబెట్టి (డీ-వాటరింగ్) అపై కంపోస్టు సేకరిస్తారు. ఇలా సేకరించే సమయంలో కంపోస్టుతోపాటుగా వానపాముల గుడ్లు కూడా బయటకు పోతుంటాయి. పరిమితంగానే వానపాములు కుండీల్లో మిగులుతాయి.
భూమికి పోషకాలు
రైతులు సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపుతుండటం మంచి పరిణామం. ఇటీవల కాలంలో పెరిగిన రసాయనిక ఎరువుల ధరలు చూసి భయపడకుండా వర్మీకంపోస్ట్ తయారీపై దష్టి సారిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సేంద్రియ ఎరువు కారణంగా భూమిలోకి నత్రజని, పాస్ఫేట్, పొటాష్‌లతోపాటు మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, బోరాన్, జింకు తదితర సూక్ష్మపోషకాలు లభ్యమవుతాయి. ప్రధానంగా వర్మీకంపోస్ట్ వాడకం మూలంగా భూమి పదును పెరగడంతోపాటు సారవంతంగా తయారై అధిక దిగుబడులు లభ్యమవుతాయి. అలాగే ఒకసారి వర్మీకంపోస్ట్ ఉపయోగిస్తే దానిసారం మూలంగా ఆ పంటతో పాటు రెండువ పంటకు ఉపయోగ పడి నాణ్యమైన దిగుబడులు వస్తాయి.
మారుతున్న పద్ధతులు
వ్యవసాయ పద్ధతులు మారుతున్నాయి. పూర్వం సేంద్రియ విధానాన్ని పాటించే వారు. పశుసంపదను పెంచుకుని దాని ద్వారా వచ్చే వ్యర్థాలను ఎరువులుగా వాడేవారు. తద్వారా భూసారాన్ని పెంచి నాణ్యమైన పంటలు పండించేవారు. కాలక్రమేణా రైతులు విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్నారు. దీంతో నేల, నీరు, వాతావరణం కాలుష్యం చెంది పర్యావరణ సమతుల్యతను కోల్పోయాయి. ఇది మానవ ఆరోగ్యానికి పెనుముప్పుగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుత శాస్త్రవేత్తలు, పాలకులు అప్రమత్తమయ్యారు. మానవ మనుగడకు ప్రశ్నార్థకంగా మారుతున్న రసాయన ఎరువుల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాత సంప్రదాయానికి స్వాగతం పలుకుతున్నారు. సేంద్రియ వ్యవసాయానికి నాంది పలుకుతున్నారు.
సేంద్రియ వ్యవసాయమంటే...
* అవసరమైనంత మేరకే నేలను దున్ని నేల కోతను తగ్గించాలి.
* వ్యవసాయమంటే పాడి-పంట. దీన్ని దృష్టిలో పెట్టుకుని పంటతోపాటు పాడి పశువుల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
* వృక్ష, జంతు సంబంధ వ్యర్థాలను అన్నింటినీ సేంద్రియ ఎరువులుగా మార్చి వినియోగించాలి.
* అంతర కృషి చేస్తూ సకాలంలో కలుపు తీసి పంటకు తగినంత పోషకాలు అందేటట్టు చూడాలి.
*జీవన ఎరువుల ప్రాధాన్యత రైతులకు తెలిపి విరివిగా వాడేటట్టు చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవన ఎరువుల ఉత్పత్తి ఎక్కువ చేసి రైతులకు అందజేయాలి.
* నీటి వనరులను సద్వినియోగం చేస్తూ నేలలోని తేమను పరి రక్షించేందుకు తగిన సేద్య విధానాలను అవలంభించాలి.
* సస్య రక్షణకు వృక్ష, జంతు సంబంధ మందులు వాడాలి.
*జీవ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చి సస్యరక్షణ చేపట్టాలి.
*పంట దిగుబడులు తగ్గకుండా నాణ్యత చెడకుండా ప్రకృతి ప్రసాదిత వనరులు ఉపయోగించుకోవాలి.
అవగాహన కల్పించాలి
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఎక్కువ అవగాహన లేదు. దీంతో ఇటువైపు ఎక్కువ మంది రావడం లేదు. రసాయనాలు వాడితే నష్టాలు, సేంద్రియ ఎరువులతో లాభాల గురించి ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసే లాభముంటుంది. దీర్ఘకాలంగా సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు.
- అడ్డూరి ఆశన్న, అనుకుంట
మూడేండ్లుగా సేంద్రియ సాగే
మూడేండ్లుగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. 4 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో సోయా సాగు చేస్తే 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మరో నాలుగు ఎకరాల్లో కంది పంట వేశాను. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పత్తిలో కూడా అధిక దిగుబడులు వచ్చాయి. సేంద్రియ పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలి.
- మంచాల గంభీర్, పార్డి, జైనథ్
అవరోధాలు
మొత్తం సాగు భూమికి కావాల్సిన సేంద్రియ పదార్ధాన్ని సేకరించడం కష్టం. రైతులకు పశు పోషణ సామర్థ్యం తగ్గింది. పశువులను పోషించలేక పోవడం వల్ల సేంద్రియ ఎరువుల తయారీ తగ్గింది. రైతుల జీవన శైలిలో మార్పు వల్ల సేంద్రియ పదార్ధాల తయారీకి సుముఖంగా ఉండడం లేదు. సేంద్రియ ఎరువుల ప్రభావం మొక్క పెరుగుదలపై ఆశించినంత లేకపోవడం వల్ల రైతులు రసాయన ఎరువులపై మొగ్గు చూపిస్తున్నారు. కౌలుకు చేసే రైతులు సేంద్రియ ఎరువులపై శ్రద్ద చూపరు. అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్లు సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. సేంద్రియ ఎరువుల వల్ల నాణ్యత పెరిగినా దిగుబడులు రసాయనిక ఎరువుల వల్లే పెంచొచ్చు. నీటి ఎద్దడి ప్రాంతాల్లో సేంద్రియ ఎరువుల సమీకరణ, సేంద్రియ సేద్యం కష్ట తరమవుతుంది. సేంద్రియ ఎరువు పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతు దానివైపు మొగ్గు చూపడం లేదు.
ప్రయోజనాలు
* నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
*నేలలో హ్యూమస్ నిల్వలు పెరిగి అన్ని పోషకాలను పంటలకు అందిస్తుంది.
* నేల భౌతిక, రసాయనిక, జీవ పరంగా అభివృద్ధి చెందుతుంది.
* నీటిని, పోషకాలను నిలువరించే గుణం పెరుగుతుంది.
* నీటి నిల్వ సామర్ద్యం , మురుగు నీరు పోయే సౌకర్యం కలుగుతుంది
* నేల కాలుష్యం తగ్గి నాణ్యతతో కూడిన ఉత్పాదకత జరుగుతుంది
* భూగర్భ జలాల కాలుష్య నివారణకు దోహదపడుతుంది.
*చీడపీడల బెడద తగ్గుతుంది
* వానపాముల అభివృద్ధికి ఇతోధికంగా సాయ పడుతుంది.
* పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుంది
* నాణ్యమైన సురక్షిత ఆహారం లభిస్తుంది.
* నాణ్యత, నిల్వ ఉండే గుణం పెరుగుతుంది.
* సుస్థిర సేద్యానికి, రైతు మనో వికాసానికి, దేశ ప్రగతికి మూలమవుతుంది
Comments
Post a Comment