సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది.
ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్ షోరూంల ఏర్పాటుతో టైలర్స్ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.
కార్పొరేట్ పోటీ..
ఫ్యాషన్‌పై యువత మోజు..
నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్ రంగం విస్తరించింది. టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు, షాట్లు రకరకాల దుస్తులు మార్కెట్లోకి వచ్చాయి. యువత ఆసక్తిని ఆదాయవనరులుగా మార్చుకునేందుకు పెద్ద బ్రాండెడ్ కంపెనీలు నగరాలతో పాటు చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలకు సైతం ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. దీంతో సామాన్యుడు సైతం స్టైల్ పట్ల ఆకర్షితుడై రెడీమేడ్ వైపు మక్కువ చూపడంతో టైలరింగ్ షాపుల మెట్లు ఎక్కేవారు క్రమేణా తగ్గి పోతున్నట్టుగా పలువురు టైలర్స్ వెల్లడిస్తున్నా రు. అదేవిధంగా మహిళలు సైతం నేడు పంజాబీడ్రెస్, లెగిన్ప్యాంట్లు, మగవారితో సమానంగా జీన్స్, టీషర్ట్స్ వినియోగంపై ఏ మాత్రమూ వెనుకడుగు వేయకపోవడంతో అంతా రెడీమేడ్ ప్రపంచంగా మారుతోంది. దీంతో ఆరు నెలల పని ఉంటే, మరో ఆరు నెలలు పనిలేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు దుస్తులు తయారీకు సంబంధించిన మెటీరియల్ ధరలు పెరుగుదలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఈ కారణంగా కుట్టుకూలీ ఎక్కువ చేయాల్సిన దుస్థితి దర్జీ కళాకారులకు ఎదురైంది. టైలరింగ్ షాపులను కూడా వ్యాపార సంస్థల కింద పరిగణించి విద్యుత్తు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్యాంట్, షర్టు జత కుట్టు కూలీ చెప్పుకునేందుకు రూ. 600 అయినా అవి తయారు చేసేందుకు రూ. 400లకు పైబడి ఖర్చు అవుతోంది. జత దుస్తులు ఇస్త్రీ చేయిస్తే రూ.22 తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక షాపు అద్దెలు, కరెంటు బిల్లులు చెల్లించి మిగిలేది కూలీ గిట్టుబాటే. రెక్కాడితేకాని డొక్కా డని దర్జీలు వృద్ధాప్యంలో కంటిచూపు కొరబడి అనారోగ్యానికి గురవడం సహజం. దీంతో సం బంధం లేని వృత్తులైన ఆటోడ్రైవర్లు, వాచ్మె న్లుగా, పెయింటర్స్‌గా పనికి పోవాల్సిన పరిస్థితి ఉందని గోడు వెళ్లబోసుకుంటున్నారు.
మహిళలకు స్వయం ఉపాధి..
సామాన్య కుటుంబాలకు చెందిన మహిళలు ఎందరో ఆర్థిక ఇబ్బందులు తీర్చుకునేందుకు స్వయం ఉపాధిగా టైలరింగ్‌ను ఎంచు కుంటున్నారు. ఇంటి పనులు చక్కదిద్దుకొని ఆదాయవనరులు పెంపొ దించుకునేందుకు గృహిణుల కు టైలరింగ్ దోహదపడుతోంది. టైలరింగ్‌ను చాలామంది మహిళలు స్వయం ఉపాధిగా మలుచుకుంటున్నారు.
కుట్టు మిషను ఆవిర్భావం ఇలా..
167 ఏండ్ల క్రితం సూది దారం ఉపయోగించి చేతితో దుస్తులు కుట్టుకునేవారు. జర్మనికి చెందిన విలియమ్స్హౌవే తన భార్య దుస్తులు కుట్టుకునేందుకు పడుతున్న అవస్థలు గమనించాడు. 1846లో తన దేశంలో 11 నెలలు ఎంతో కష్టపడి ఫిబ్రవరి 28వ తేదీన కుట్టుమిషన్‌ను కనిపెట్టారు. అప్పటినుంచి ప్రపంచ వ్యాప్తంగా కుట్టుమిషన్లు వినియోగ ంలోకి వచ్చాయి. అందువల్లనే ఫిబ్రవరి 28న ప్రపంచ వ్యాప్తంగా దర్జీల దినోత్సవం జరుపు కుంటారు.
డిమాండ్లు..
దర్జీలు ప్రభుత్వ ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారు. టైలర్స్‌కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. నివాసస్థలా లతో పాటు ఇండ్లు నిర్మించుకునేందుకు నిధులు కేటాయించాలి. చేనేతల మాదిరిగానే 50 ఏండ్ల కు పింఛన్లు, పిల్లల చదువులకు ఫీజుల చెల్లిం పుల్లో రాయితీలు, టైలరింగ్షాపులకు విద్యుత్తు ఛార్జీలు విధింపులో రాయితీ కల్పించాలని దర్జీ కళాకారులు కోరుతున్నారు.
జీవనభృతి వర్తింపజేయాలి
27 సంవత్సరాలుగా టైలరింగ్ వృత్తిని నమ్ముకునే జీవితం సాగిస్తున్నాను. రెడీమెడ్ దుస్తులతో మా వ్యాపారానికి తీవ్రంగా గండి పడింది. రెండున్నర దశాబ్దాలుగా పని చేస్తున్నా మిగిలిందేమీ లేదు. పని ఉన్న సమయంలో వచ్చిన డబ్బులతోనే కుటుంబ అవసరాలు తీరుతాయి. పని లేకుంటే అప్పులు చేయాల్సిందే. బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు ఇచ్చినట్టు టైలర్లకు కూడా జీవనభృతిని వర్తింపజేయాలి. పిల్లలకు విద్యలో రాయితీ, అనారోగ్య సమస్యలకు వైద్యంలో రాయితీ అందించాలి.
- అంగాజి వెంకటస్వామి, ఏవీఎస్ టైలర్స్
కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలి
మూడు దశాబ్దాలుగా టైలర్‌గా పని చేస్తున్నాను. రెడిమేడ్ దుస్తులతో గిరాకీ తగ్గింది. పని ఉన్నప్పుడు రోజుకు రూ. 300 వరకు సంపాదిస్తున్నా. టైలరింగ్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదు. అర్హులైన పేదవారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ప్రభుత్వం ఆదుకోవాలి. బ్యాంకు రుణాలు అందిస్తే టైలరింగ్ రంగం రాబోయే రోజుల్లో కొంత మెరుగ్గా ఉంటుంది. టైలర్లకు సంక్షేమ పథకాలేవీ లేకపోవడం బాధాకరం.
- దీపక్, టైలర్
Comments
Post a Comment