నవతెలంగాణ - ఆదిలాబాద్ టౌన్, ఉట్నూర్
ప్రేమ ప్రేమికులను గమ్మత్తైన మత్తులో ముంచెత్తుతూ ఆశల పల్లకిలో.. ఊహల జగతిలో విహరింపజేస్తుందని కొందరు అభిప్రాయం. ప్రేమ ఓ ఊబిలాంటిదని, అందులో చిక్కుకున్న వారు బయట పడడం కష్టమని మరికొందరు చెబుతుంటారు. ఇలా రకరకాలుగా నిర్వచనం చెప్పుకునే ప్రేమను పండుగలా జరుపుకోవడానికి ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. అదే ప్రేమికుల రోజు. ప్రతి ఏటా ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్‌డే గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం 270లో రోమ్ అధిపతిగా క్లాడియన్ రాజ్యవిస్తరణ కాంక్షతో దేశంలో యుక్త వయస్సు ఉన్న అందరినీ సైన్యంలో చేరమని శాసించాడు. వివాహాలు, కుటుంబాలనే నెపంతో చాలా మంది యువకులు సైన్యంలో చేరకుండా తప్పించుకుని తిరగడం మొదలుపెట్టారు. అలాంటి వారిపై మండిపడ్డ క్లాడియస్ తన రాజ్యంలో వివాహాలను నిషేధించాడు. ఆ నగరంలో రోమన్ క్యాథలిక్ బిషప్‌గా ఉన్న వాలెంటైన్ క్లాడియస్ నిర్ణయాన్ని నిరసిస్తూ తన వద్దకు వచ్చిన జంటలకు నిర్భయంగా వివాహాలు చేశారు. క్లాడియస్ అతడిని కారాగారంలో బంధించి రాళ్లతో కొట్టి హింసించి చివరికి ఉరి తీయించారు. కారాగారంలో ఉన్నప్పుడు వాలెంటైన్‌కు జైలర్ కుమార్తెతో పరిచయం అయింది. అంధురాలైన ఆమెకు ప్రేమపట్ల అచంచలమైన విశ్వాసం ఉండేది. అదృష్టవశాత్తు ఆమెకు చూపు వచ్చింది. మరణించే ముందు వాలెంటైన్ ఆమెకు నీ వాలెంటైన్స్ నుంచి... అంటూ ప్రేమ సందేశం పంపాడు. అతడిని ఉరి తీసిన ఆ రోజునే ఏటా ప్రపంచమంతటా వాలెంటైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారని ప్రచారంలో ఉంది.
పెండ్లే లక్ష్యం కావాలి..
నిజమైన ప్రేమ లక్ష్యం పెండ్లే ప్రేయసీప్రియులు వారి ప్రేమకు సార్థకత కల్పిస్తూ వివాహ బంధంతో ఒక్కటై నిండు నూరేండ్లు భార్యాభర్తలుగా జీవితం కొనసాగించాలి. సామాజికంగా అటువంటి ప్రేమ సర్వదా ఆమోదయోగ్యం, అభిలషణీయం. అలా జరగనినాడు అది యువత వ్యక్తిత్వంపై మాయని మచ్చే. ప్రేమ.. రెండు హృదయాల ఆత్మీయ కలయికగా ఉండాలి. బలవంతపు ప్రేమ, యాసిడ్ ప్రేమ, అంగీకరించకుంటే లైంగిక దాడి, హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడటం.. ఇలాంటివే ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న వైపరీత్యాలు. మానసిక పరిపక్వత కలిగిన ప్రేమ గెలిచినా.... ఓడినా.. మధురంగా.. మరుపురానిదిగా ఉంటుంది. ప్రేమికులకు కావాల్సింది అందం, ఆకర్షణ కాదు.. మనోధైర్యం. అది ఉంటే ఈ భగప్రేమికుల ఆత్మహత్యలు ఉండవు. అటువంటి జీవితం భవిష్యత్తరాలకు మార్గదర్శకం అవుతుంది.
గ్రీటింగ్ కార్డులే ప్రత్యేకం..
చేతితో రాసిన లేఖలను ఇచ్చే సంప్రదాయంగా 19వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ ప్రేమ.. భారీ స్థాయిలో గ్రీటింగ్ కార్డుల తయారీకి, ప్రస్తుతం అంతర్జాల వేదికగా జరుగుతున్న బహుమతుల వ్యాపారంగా పరిణామం చెందింది. గ్రేట్ బ్రిటన్‌లో 19వ శతాబ్దంలో వాలెంటైన్‌లను (ప్రేమ కానుకలను) పంపడం నాగరికమైంది. 1847లో ఈస్టర్ హౌలాండ్ అనే మహిళ మాసాచుసెట్స్‌లోని వర్సెస్టెర్‌లో ఉన్న తన ఇంటిలో బ్రిటీష్ నమూనాల్లో చేతితో వాలెంటైన్ కార్డులను తయారుచేసి, విజయవంతమైన వ్యాపారాన్ని అభివృద్ధిపరిచారు. 19వ శతాబ్దపు అమెరికాలో వాలెంటైన్ కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ దేశంలో ఇప్పుడు ఎక్కువ వాలెంటైన్ కార్డులు ప్రేమ ప్రకటనలతో కాకుండా సాధారణ గ్రీటింగ్ కార్డులుగా తయారవుతున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్‌కు పైగా వాలెంటైన్ కార్డులు పంపబడుతున్నట్లు గ్రీటింగ్‌కార్డుల సంఘం అంచనా వేసింది. ఏడాదిలో క్రిస్మస్ తర్వాత కార్డులు ఎక్కువగా పంపే రోజుగా వాలెంటైన్స్ డే గుర్తింపు పొందింది.
'ప్రేమ' వ్యాపారం
ప్రేమికుల రోజు... వారం ముందే.. అంటే ఫిబ్రవరి 7న 'రోజ్ డే' పేరుతో ప్రారంభమవుతోంది. ఆ తర్వాత వరుసగా ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే, చివరిగా వాలెంటైన్స్ డే. ఇదంతా విదేశీ సంస్కతే అయినా... మనదేశంలోనూ విస్తృతంగానే వ్యాపించింది. ఈ రోజులన్నింటా ప్రేమ పేరుతో ఆయా వస్తువుల వ్యాపారం పెద్దఎత్తున జరుగుతోంది. ప్రేమికుల దినోత్సవం.... ప్రేమికులకు పండుగ రోజే. ఈ రోజును వ్యతిరేకించే వాళ్లు ఉన్నా, వారితో తమకేంటి... ప్రేమకు అడ్డెవ్వరు ... అని ముందుకు సాగే ప్రేమ జంటలు అధికమే. తమ ప్రేమను వ్యక్తం చేసే వాళ్లు కొందరు అయితే, ఆనందోత్సాహాలతో ప్రేమికుల దినోత్సవాన్ని గడిపే ప్రేమికులు మరి కొందరు. ఈ రోజున ప్రేయసికి ప్రియుడు, ప్రియుడికి ప్రేయసి కానుకలు ఇచ్చుకోవడం సహజం. టెక్నాలజీ విస్తరించినా, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ రూపంలో మొబైల్స్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుకున్నా, ప్రేమికుల రోజున కానుకలు ఇవ్వడం, పుచ్చుకోవడంలో ఉన్న కిక్కే వేరు. ఈ ప్రేమికుల్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో ప్రత్యేక కానుకలు ఏర్పాటు చేశారు. ప్రేమించుకుంటున్న వాళ్ల కోసం, ప్రేమను వ్యక్తంచేసే వాళ్ల కోసం వివిధ రకాల సంభాషణలతో కూడిన ప్రత్యేక డిజైనింగ్ కార్డులు, చాక్లెట్లు, ప్రేమను చాటే వివిధ రకాల ఆకర్షణీయమైన గిఫ్టులు, గాజు, పింగాణీతో తయారు చేసిన వస్తువులు, ఇలా... ఎన్నో, మరెన్నో చూడగానే ఆకర్షించే, మనస్సుకు హత్తుకునే కానుకల్ని విక్రయాలకు ఉంచారు. ప్రేమ పండుగకు మరో రోజు మాత్రమే సమయం ఉండడంతో తమకు నచ్చినవాళ్లకు కానుకల్ని ఇచ్చేందుకు యువతీ, యువకులే కాదు, ఒకప్పటి ప్రేమికులు, ఆనందకర జీవితాలను అనుభవిస్తున్న దంపతులు సిద్ధమవుతున్నారు.
ఆకర్షణే ప్రేమ కాదు...
ప్రేమలో ఆకర్షణ కూడా ఉంటుంది. కానీ ఆకర్షణే ప్రేమ కాదు. జీవితం మొత్తానికి సరిపడ సమగ్ర అవగాహనతో ప్రేమికులు నిర్ణయం తీసుకోవాలి. పెద్దలను ఒప్పంచి కలిసి జీవించేందుకు సిద్ధపడాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల వివాహానంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రేమలో క్షణికావేశం ఉండకూడదు. చదువులో రాణించి, ఉద్యోగ ప్రస్థానంలో స్థిరపడి, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించి, పరిణితి చెందిన వయసులోనే నిజమైన ప్రేమను అందుకోవాలి.
సినిమా, సెల్‌ఫోన్లతో జాగ్రత్త...
24 ఫ్రేముల్లో చకచకా సాగిపోయే చలన చిత్రాలు యువతను బాగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రేమకథా చిత్రాలైతే మరింతగా వారి హృదయాల్లో చేరిపోతున్నాయి. సినీ కథానాయిక, నాయకుల సంభాషణలు, వారి వేష, భాషలు, సంభాషణలు తమ జీవితాలకు అన్వయించుకుంటున్నారు. యువత చేతుల్లో ప్రత్యక్షమవుతున్న ఆధునిక సెల్‌ఫోను కూడా వారి బంగారు జీవితాలను నాశనం చేస్తున్నాయి.
హత్యలు.. ఆత్మహత్యలు వద్దు
ప్రేమించడం తప్పు కాదు కానీ.. ప్రేమించిన వారిని బాధపెట్టడం మోసానితో సమానం... నేటి కాలంలో ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లలో ప్రేమా పుడుతోంది. ప్రేమా పేరిట మోసాలు సైతం జగరుతున్నాయి. ప్రేమించిన ప్రియురాలు దక్కాలని ప్రియుడు ఉన్నత చదువులు చదువుకోని మంచి స్థాయికి ఎదిగి జీవితంలో స్థిరపడాలనే ఆశయాన్ని వమ్ము చేసుకుంటున్నారు నేటీ యువత. ప్రేమ ఫలిస్తే ప్రాణాలు పోస్తోంది.. కానీ కొన్నిసార్లు ప్రాణాలు తీస్తోంది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రియురాలి కోసం కన్న వారిని బాధపెడుతున్నారు యువత.. జీవితంలో ప్రేమించిన అమ్మాయినే పెండ్లి చేసుకోవాలనే తపన ఉంటే తొలుత తమ సొంత కాళ్లపై నిలబడి జీవితాన్నిప్రారంభించాలి. కానీ ప్రేమికులు అంటూ ఒకరొనోకరు అర్థం చేసుకోకుండా ప్రేమలో జరిగే చిన్నచిన్న విషయాల వలన మనస్పర్థలు ఎదురై జీవితాలు నాశనం చేసుకుంటున్న సంఘటనలు
అనేకం. అమ్మాయి ప్రేమించలేదని బెంగతో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే.. మరొకరు ప్రేమను నిరాకరించిందని అమ్మాయిపై దాడి చేసి గొంతు కోయడం లాంటి చర్యలకు పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
కార్పొరేట్ కల్చర్..
ప్రేమ విశ్వజనీనమైనది. ఓ అద్భుతమైన అపూర్వమైన భావన. రెండు హృదయాల స్పందన. రెండు మనసుల తీర్మానం. ఇద్దరు వ్యక్తుల అర్థవంతమైన జీవన పయనం. కులమతాలకు, వయసు తారతమ్యాలకు, భాషాకు, ప్రాంతాలకు.. సంస్కృతీ సంప్రదాయాలకు అతీతమైన బంధం. ఇది వాలెంటైన్‌తోనో, దేవదాసు పార్వతీలలో, లైలామజ్నూలతోనో మొదలవ్వలేదు. అందుకే అంటాడో కవి... 'తాజ్‌మహల్ కూలినా ప్రేమ ఉంటుంది' అని. మనిషి పుట్టినప్పుడే ప్రేమ పుడుతుంది. ఈ రోజు కొత్తగా పుట్టింది కాదు. ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్స్, గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవటం లేటెస్ట్ ట్రెండ్ అయితే... ఆ రోజుల్లో ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమలేఖలు నడిచేవి. అందుకోసం రాజహంసలు, పావురాలతో రాయబారాలు నడిపితే... భావకుడైన ప్రేమికుడు చందమామను.. మేఘాలను.. ప్రతీకలుగా చేసి ప్రేయసికి కవితాత్మక సందేశాలు పంపేవాడు. మారుతున్న కార్పొరేట్ కల్చర్‌కు అనుగుణంగా ప్రేమ వ్యక్తీకరణకు సంబంధించిన అనేక బొమ్మలు, నమూనాలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవన్నీ ప్రేమను వ్యక్తపరిచే చిహ్నాలుగా మారిపోయాయి. మొబైల్ ఫోన్లు, సోషల్‌మీడియా, ఈకామర్స్ వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తీకరణ స్వరూపంలోనూ చాలా మార్పొచ్చింది. ఎంత ప్రేమతో ఇచ్చారనే దానికంటే... ఎంత ఖరీదైనది ఇచ్చారనేదానికే ప్రాధాన్యత పెరిగింది. ఇది వ్యాపార ప్రపంచం స ష్టించిన మాయాజాలం. ఈ మాయాజాలంలో నిజమైన ప్రేమకు గుర్తింపు లేకుండా పోయింది. నిజమైన ప్రేమంటే..? అనే ప్రశ్న తలెత్తుతోంది. తమ ప్రేమను ఎంత బాగా వ్యక్తీకరించగలిగితే అదే నిజమైన ప్రేమ.. అనుకునే పరిస్థితిని ఈ కార్పొరేట్ వ్యవస్థ కల్పించింది. పర్యవసానంగా బహుమతి లేకుండా ప్రేమను వ్యక్తం చేయలేని పరిస్థితిలోకి ప్రేమికుల్ని నెట్టేసింది.
మనుసులు ఒక్కటే...
వారి కులాలు వేరైన మనసులు మాత్రం ఒక్కటే. ప్రేమే కులమని ప్రేమ పెండ్లి చేసుకొని ఒక్కటయ్యారు సిర్పూర్(యు) మండలానికి చెందిన జాటోత్ ఉపేందర్, విష్ణుకాంత. ప్రేమించి పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే పెద్దలు అంగీకరించలేదు. స్నేహితులు దాదు ఖాన్, ఆత్రం భగవంత్‌రావు, లక్యా నాయక్, రాథోడ్ మోహన్, జాదవ్ నెహ్రూ, షహెనాజ్ సహకారంతో 1999 ఏప్రిల్ 16వ తేదీన స్నేహితుల సహకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఉపేందర్ ఐటీడీఏలోని ఓఎస్‌డీ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తమ సొంత కాళ్లపై నిలబడినప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా అధిగమించవచ్చని చెబుతున్నారు వీరు.
తోడునీడగా ఉండాలి
ప్రేమించి పెండ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు జీవితంతం కలిసి ఉండాలి. ఒకరినొకరు అర్ధం చేసుకొని సంసారం చక్కదిద్దుకోవాలి. అంతేగాని మనస్పర్థలకు తావివ్వవద్దు. అనవసరంగా జీవితం నాశనం చేసుకోవద్దు. మాది ప్రేమ వివాహం. 16 సంవత్సరాల క్రితం ఒకరినొకరం ప్రేమించుకొని పెండ్లి చేసుకున్నార. కలిసి సుఖంగా ఉన్నాం. ప్రేమించి పెండ్లి చేసుకున్నాం అన్నది ముఖ్యం కాదు. కలిసిమెలిసి ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం. అందు కోసం ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరి మనసును మరొకరు నొప్పియ్యకూడదు.
-శ్రీనివాస్ వర్మ-శారద వర్మ
పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నాం
మాది ప్రేమ వివాహం. 17 సంవత్సరాల క్రితం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ప్రేమ విషయాన్ని నిర్భయంగా పెద్దలకు చెప్పాం. పెద్దల సమక్షంలోనే మా వివాహం జరగడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అటు ప్రేమ, ఇటు పెద్దలు ఒప్పుకోవడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఇన్నేండ్ల కాలంలో మనస్పర్థలు లేకుండా జీవిస్తున్నాం. సంతోషంగా కాలం వెళ్లదీస్తున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. బాబు పదో తరగతి, పాప ఎనిమిదో తరగతి చదువుతోంది. వారి భవిష్యత్తుపైనే మా దృష్టంతా.
- లక్ష్మీ- శ్రీకాంత్
ప్రేమకు-ప్రాణత్యాగాలకు ముడిపెట్టవద్దు
ప్రేమను పెద్దలు అడ్డుకోవడం వల్ల, లేదా ప్రేమికుల మధ్య పరిణతి లోపించడం వల్ల తొందరపాటుతో, నైరాశ్యంతో ప్రాణత్యాగాలు జరుగుతూ ఉంటాయి. ప్రేమ జీవితమంత పెద్దది, విశాలమైనది. అది వసంత రుతువు లాంటిది. కానీ శిశిరంగా ఎన్నటికీ రాలిపోకూడదు. ప్రేమత్యాగానికి పర్యాయపదమని కొందరు అంటారు. అయితే అది ప్రాణత్యాగంగా పరిణమించకూడదు. ఇలాంటి ఘటన వల్లే ప్రేమ పట్ల సమాజంలో దురభిప్రాయాలు పెరుగుతూ ఉంటాయి.
కష్టసుఖాల్లో తోడుగా ఉండాలి
ప్రేమ అనేది కుటుంబ పెద్దలను బాధపెట్టకుండా ఉండాలి. వారిని ఒప్పించి పెండ్లిళ్లు చేసుకోవాలి. ఒకరినొకరు ప్రేమించి, నమ్మకముంచి పెండ్లి చేసుకున్నప్పుడు జీవిత భాగస్వామికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి బాధలను మరొకరు పంచాలి. సంసారంలో మనస్పర్థలను రానివ్వవద్దు. ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ప్రేమ వివాహం ఆదర్శవంతమ వుతుంది. ప్రేమపై మరింత నమ్మకం పెరుగుతుంది.
-మెస్రం విజరు-తిరుమల
బాధ్యతలు గుర్తెరగాలి..
కేవలం ప్రేమిస్తేనే సరిపోదు. బాధ్యతలు గుర్తెరగాలి. వాటిని నిర్వర్తించే శక్తి సంపాదించాలి. తనను నమ్మి వచ్చిన భాగస్వామికి ఎప్పుడు అండగా ఉండాలి. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు ప్రేమ అనే పదానికి నిర్వచనమే తెలియదు. ప్రేమిస్తే.. పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకోవాలి. అంతేకాని అఘాయిత్యాలకు పాల్పడడం మంచితి కాదు. పెండ్లి చేసుకున్న తర్వాత ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
-సుధీర్, సౌజన్య
నేడు ప్రేమికుల దినోత్సవం
ప్రేమికులకు పండగే....
వాలంటైన్స్ డే అంటే ప్రేమికులకు పండగ రోజే... ప్రేమికుల రోజు కోసం ప్రేమికులు నెలల పాటు వేచి చూస్తారు. తాము ప్రేమించే వారికి ఊహించని బహుమతులు ఇవ్వాలనుకుంటారు. ప్రేమికుల రోజు నాడే పెండ్లి కావాలని కలలు కంటారు. అయితే ప్రేమ అనేది ఇతరులను బాధపెట్టకూడదు. తల్లిదండ్రులను ఒప్పించి పెండ్లి చేసుకుంటే ఆ ప్రేమ కలకాలం నిలిచిపోతుంది.
- మహ్మద్ ముస్తఫా, వజీర్‌పూర, ఉట్నూర్
Comments
Post a Comment