Skip to main content

సీపీఎస్ అంత‌మే పంతం - Losses of CPS Scheme for Govt Employees




ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే తమ జీవితానికి ఇక ఎలాంటి ఢోకా ఉండదనేది ఇంతవరకు ఉన్న నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే 'ఇక ఏమీ ఢోకా లేదురా.. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ మంచిగా బతుకుతాడ'ని కుటుంబసభ్యులు సంతోషపడేవారు. కానీ పాలకుల పుణ్యమా అని ఆ సంతోషం ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, వారి కుటుంబసభ్యుల్లో కానీ లేదు. కారణం నూతన పెన్షన్‌ విధానం. ఈ నూతన పెన్షన్‌ విధానంలో ఉద్యోగులకు భద్రత లేకపోగా విరమణ అనంతరం తమకు వచ్చే లాభాలేమిటో కూడా తెలియని పరిస్థితి.


2004 సెప్టెంబర్‌ ఒకటో తేదీ తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులందరికి నూతన పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన 2001లోనే కేంద్రం చేపట్టింది. ఉద్యోగులు వారి వేతనంలోని పది శాతం సొమ్మును ఈ పథకంలో జమ చేస్తే అంతే మొత్తం ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తుంది. అందుకే ఈ పథకాన్ని మొదట్లో కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) అని పేరు పెట్టారు. ప్రస్తుతం దీనిని నూతన పెన్షన్‌ స్కీంగా పిలుస్తున్నారు. సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికి నూతన పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి 2001లోనే వచ్చింది. అప్పటి ఎన్టీయే ప్రభుత్వం పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లోనే దీని ప్రకటన చేసింది. సీపీఎస్‌ విధి విధానాలను రూపొందించడం కోసం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం సీపీఎస్‌ విధానాన్ని రూపొందించి అమల్లోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానుసారానికే వదిలివేసింది. ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ అనంతరం ఇచ్చే లాభాలను ఆయా రాష్ట్రాలే భరిస్తుండడంతో సీపీఎస్‌ విధానాన్ని కూడా అమలు చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికే కేంద్రం వదిలివేసింది. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ జీఓ నెంబర్‌ 653, 654, 655లను 22-09-2004న జారీ చేసింది.
అసలు జీఓలలో ఏముంది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన మూడు జీఓలు ఉద్యోగులను ఇరకాటంలోకి నెట్టాయి. జీఓ నెంబర్‌ 653 ఆర్థిక పెన్షన్‌. ఇది 22-09-2004న అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఈ జిఓ ప్రకారం 1-9-2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి రివైజ్‌డ్‌ పెన్షన్‌ రూల్స్‌ వర్తించవు. ఈ జీఓ కారణంగా ఉద్యోగులు కమ్యూటేషన్‌ కోల్పోతారు. రెండో జీఓ నెంబర్‌ 654. ఇది కూడా 22-09-2004న అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఈ జీఓ ప్రకారం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికి జీపీఎఫ్‌ రూల్స్‌ 1975 వర్తించవు. దీంతో ఉద్యోగులు పెన్షన్‌, ఫ్యామిలి పెన్షన్‌ కోల్పోతారు. మూడో జీఓ నెంబర్‌ 655. ఇది కూడా 22-09-2004న అసెంబ్లీలో తీర్మానం పొందింది. ఈ జీఓ వల్ల ఉద్యోగి సీపీఎస్‌ చందా నెలా నెలా తమ జీతం నుంచి రికవరీ చేయబడుతుంది. చందా బేసిక్‌, డీఏ మీద పది శాతంగా నిర్ణయించారు. ఉద్యోగుల చందాకు సమానంగా ప్రభుత్వం తన వాటాను జమ చేస్తుంది. ఈ రెండు మొత్తాలు న్యూ పెన్షన్‌ స్కీం ట్రస్టుకు అందిస్తారు. వీరు ఈ ఫండ్‌ను వివిధ పెన్షన్‌ పథకాల్లో పెట్టుబడి పెడతారు. అలా వచ్చిన మొత్తంలో ఉద్యోగి పదవీ వీరమణ పొందే నాటికి జమ అయన మొత్తంలో 60 శాతం ఉద్యోగికి చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాల్సిందే. ఈ పెట్టుబడి నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా ఉద్యోగికి, అతని కుటుంబసభ్యులకు ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పెన్షన్‌ అందిస్తారు. అయితే ఎంత పెన్షన్‌ వస్తుందో కచ్చితంగా తెలిసే అవకాశం లేదు. ఈ జీఓ వల్ల ఉద్యోగి తన ఉద్యోగ విరమణ తర్వాత సామాజిక, ఆర్థిక భద్రతను కోల్పోతాడు.
అమలు చేయని కొన్ని రాష్ట్రాలు
కేంద్రం సీపీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టినా కొన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయడం లేదు. ఆ రాష్ట్రాల్లో ఇప్పటికీ పాత పెన్షన్‌ విధానమే అమలులో ఉంది. పశ్చిమబెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలు ఇప్పటికి కూడా సీపీఎస్‌ను అమలు చేయడం లేదు. పంజాబ్‌లో ప్రస్తుతం ఎన్నికలు ఉండడంతో అన్ని పార్టీలు సీపీఎస్‌ను అమలు చేయబోమని ఎన్నికల మెనిఫెస్టోలలో పొందుపర్చాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో సీపీఎస్‌ విధానాన్ని పున:సమీక్షించేందుకు ముగ్గురు ఎంఎల్‌సీలు, ముగ్గురు మంత్రులతో కమిటీ వేశారు. మధ్యప్రదేశ్‌లో కూడా కమిటీ వేశారు. హర్యాణా రాష్ట్రంలో డెత్‌ గ్రాట్యుటీ సౌకర్యాన్ని కల్పించడంతోపాటు సీపీఎస్‌పై కమిటీ వేశారు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీపీఎస్‌ విధానంపై ఇప్పటి వరకు స్పందించడం లేదు.
ఉద్యమబాట పట్టిన ఉద్యోగులు
తమ జీవితాలకు ఎలాంటి భద్రత ఇవ్వని సీపీఎస్‌ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్‌ ఉద్యోగులు 1,18,500 మంది ఉన్నట్టు అంచనా. ఇందులో కొమురంభీం జిల్లాలో సుమారు 700 మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా తెలంగాణ స్టేట్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ అసోషియేషన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌)అమలు చేయాలని ఉద్యమాలు చేపడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో 22 మంది మృతి
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు 22 మంది సీపీఎస్‌ ఉద్యోగులు మృతి చెందారు. అయితే వీరి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందుతున్న డబ్బులు అంతంతే. కుమ్రం భీం జిల్లా సిర్పూరు (యు) మండలంలో రాథోడ్‌ సచిన్‌, జైనూర్‌ మండలంలో రాథోడ్‌ గణేష్‌ అనే ఇద్దరు ఉపాధ్యాయులు మృతిచెందారు. కౌటాల మండలంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా విదులు నిర్వర్తించే గోరక్‌నాథ్‌ మృతి చెందాడు. గోరక్‌నాథ్‌ 2011లో విధుల్లో చేరగా 20-08-2015న మృతి చెందాడు. రాథోడ్‌ గణేష్‌ 2013, ఏప్రిల్‌లో విధులలో చేరగా 2016, ఆగస్టు 17న మృతి చెందాడు. రాథోడ్‌ సచిన్‌ సర్వీసులో చేరిన మూడు నెలలకే మృతి చెందాడు. వీరి కుటుంబసభ్యులకు ఇప్పటి వరకు ఒక్క పైసా ప్రభుత్వపరంగా అందలేదు. పాత పెన్షన్‌ విధానంలో వీరుంటే వీరికి డెత్‌ గ్రాట్యుటీ కింద రూ. 12 లక్షలు తక్షణమే అందించేవారు. బేసిక్‌ పేలో 50 శాతం పెన్షన్‌ కింద వస్తుండేది. కుటుంబసభ్యులలో ఒకరికి ఉద్యోగం వచ్చేది. కాని వీరు సీపీఎస్‌ ఉద్యోగులు కావడంతో ఇందులో ఏ ఒక్కటి కూడా వీరికి వర్తించలేదు.
సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళనలు
* 28 నవంబర్‌ 2016న న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పీఆర్‌టీయూటీఎస్‌, టీఎస్‌సీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో సీపీఎస్‌ ఉద్యోగులు ధర్నా చేపట్టారు.
 * 29 నవంబర్‌ 2016న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద టీఎస్‌యూటీఎఫ్‌, టీఎస్‌సీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
* 2 డిసెంబర్‌ 2016న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి వినతిపత్రం అందజేశారు.
* సీపీఎస్‌ విధానాన్ని నిరసిస్తూ 10 డిసెంబర్‌ 2016న కాగజ్‌నగర్‌లో సీపీఎస్‌ ఉద్యోగులు మెగా రక్తదానశిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. దీనికి ముందు ఆయా మండలాల తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.
* 23 అక్టోబర్‌ 2016న కాగజ్‌నగర్‌లో 173 మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఒక రోజు నిరాహార మహాదీక్ష చేపట్టగా, దీక్షా శిబిరాన్ని ఎంపీ నగేష్‌, ఎంఎల్‌ఏ కోనేరు కోనప్ప సందర్శించి సీపీఎస్‌ రద్దుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
* 29 జనవరి 2017న ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో సీపీఎస్‌ ఉద్యోగులు మహాదీక్ష చేపట్టగా 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరానికి వచ్చిన ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఏ కోవ లక్ష్మి మృతి చెందిన సీపీఎస్‌ ఉద్యోగులు రాథోడ్‌ గణేష్‌, రాథోడ్‌ సచిన్‌ కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
సాధించే వరకు విశ్రమించం
ఆదిలాబాద్‌ జిల్లాలో వేల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో వివిధ చోట్ల ఆందోళనలు చేపట్టాం. పాత పెన్షన్‌ విధానం సాధించుకునే వరకు విశ్రమించం. సీపీఎస్‌ విధానంతో అనేక నష్టాలు ఉన్నాయి. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదు. పోరాడి ఓపీఎస్‌ను సాధించుకుంటాం'.
- చెట్లపల్లి సంతోష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు
కమ్యూనిస్టు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలి
'సీపీఎస్‌ విధానం అమలు విషయంలో కమ్యూనిస్టు రాష్ట్రాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి. పశ్చిమబెంగాల్‌, త్రిపురలలో కేంద్రం ఆదేశాలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకుండా పాత పెన్షన్‌ విధానాన్నే కొనసాగిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే దీనిపైకమిటీలు వేసి పునరాలోచన చేస్తున్నాయి. మన రాష్ట్రప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సీపీఎస్‌ రద్దుకు చర్యలు తీసుకోవాలి.
- ఎన్‌ నవనీత్‌ రెడ్డి, జిల్లా కోశాధికారి, టీఎస్‌సీపీఎస్‌ఈఏ
రద్దయ్యేంతవరకు పోరాటం
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌విధానం రద్దయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సీపీఎస్‌ విధానం తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం మాయమాటలు చెబుతూ ఈవిధానమే ఉద్యోగులకు లాభదాయకమని చెబుతోంది. ఏ విధంగా లాభదాయకమో లెక్కలు చూపాలి. ఉద్యోగి మరణిస్తే కనీసం డెత్‌ గ్రాట్యూటీ ఇవ్వని ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
- సీమర్ల నర్సయ్య, జిల్లా అధ్యక్షులు, టీఎస్‌సీపీఎస్‌ఈఏ

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...