Skip to main content

ఆశ‌పెట్టి‌..అప్పు‌ల‌పాల్జే‌శారు - Minority loans in Adilabad

ఇతని పేరు మహమ్మద్‌ నదీమ్‌. పట్టణంలోని సంజరునగర్‌లో నివాసముంటాడు. స్వయం ఉపాధి పొందుదామని 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష రుణం కోసం మైనార్టీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. రుణం మంజూరైనట్టు అధికారులు ప్రొసీడింగ్‌ ఇవ్వగా, బ్యాంకు అధికారులు లోన్‌ అకౌంట్‌ కూడా ఇచ్చారు. డబ్బులు రావడానికి కొంత సమయం పడుతుందన్నారు. అది నమ్మిన అతను రూ. 2 లక్షలు అప్పులు చేసి ఎలక్ట్రికల్‌ దుకాణం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి రుణం డబ్బులు అకౌంట్‌లో ఎప్పుడు పడతాయో, ఎప్పుడు అప్పు తీర్చాలోనని రెండేండ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అప్పుపై వడ్డీ పెరుగుతోందే తప్ప ఇతనికి రుణం మాత్రం అందడం లేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, మైనార్టీ కార్పొరేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందించే వారు కరువయ్యారు. ఇదీ ఒక్క నదీమ్‌ పరిస్థితే కాదు.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వందలాది మంది మైనార్టీ యువకులు మూడేండ్లుగా రుణాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఒక్క రూపాయి అందక మైనార్టీ యువకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు పేద మైనారిటీలు 80 శాతం రాయితీతో ఇచ్చే రుణాల కోసం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 1090 మందికి రుణాలు మంజూరు చేస్తూ మైనార్టీ శాఖ అధికారులు ప్రొసీడింగ్‌లు ఇచ్చారు. బ్యాంకు అధికారులు కూడా లోన్‌ అకౌంట్‌లు ఇవ్వడంతో ఇక తమకు రుణాలు అందినట్టేనని భావించారు. అప్పులు చేసి చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు. అయితే అధికారులు 795 మందికి రుణాలు ఇవ్వగా, మరో 295 మందికి రుణాలు ఇవ్వలేదు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని వారు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్‌, మైనార్టీ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. రెండేండ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామని, అధికారులను అడిగితే మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. మరోసారి దరఖాస్తు చేసుకుంటే రుణం వస్తుందనే గ్యారంటీ లేదని, గతంలో మంజూరు చేసిన ప్రొసీడింగ్స్‌ మీదే ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.
ఇంకా అందని 2015-16 రుణాలు
ఇదిలా ఉండగా, 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసి ఏడాదవుతున్నా ఇంకా మైనార్టీ యువకులకు రుణాలు అందలేదు. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెదుతున్నారు. మైనారిటీ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం గత ఏడాది మార్చితో ముగిసినప్పటికీ రుణం అప్పుడు.. ఇప్పుడు వస్తుందా అంటూ నేటికీ లబ్ధిదారులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం వేలాది మంది దరఖాస్తు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 543 యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది. వీటిలో 273 మందికి అధికారులు మంజూరు ఇచ్చారు. వీటిలో 154 మందికి సంబంధించి వివరాలు రాగా, ఇంకా 119 మందికి సంబంధించి వివరాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా రుణ డబ్బులు ఇవ్వలేదు.
ఒక ఏడాది మాయం..
రుణాల మంజూరులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం మధ్యలో ఒక ఏడాదిని మాయం చేస్తోంది. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో రుణాల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన ప్రభుత్వం, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలే ఇంకా ఇవ్వలేదు. మరో నెలన్నర రోజులు గడిస్తే 2016-17 ఆర్థిక సంవత్సరం ముగిసి 2017-18 ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. మళ్లీ ఆ సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారే తప్ప గడిచిపోయిన సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు తీసుకునే వీలు లేవు. దీంతో ఒక ఏడాది రుణాల మంజూరు నుంచి ప్రభుత్వం తప్పించుకున్నట్టయింది.
త్వరలో మంజూరు చేస్తాం : నదీం, ఈడీ, మైనార్టీ సంక్షేమశాఖ
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణాలు త్వరలో మంజూరవుతాయి. ఇప్పటికే ప్రక్రియ అంతా పూర్తయింది. రుణాలు మంజూరైన వారి బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు జమవుతాయి. ఇంకా 2014-15 ఆర్థిక సంవత్సరంలో కొందరికి రుణాలు మంజూరైనా బడ్జెట్‌ లేకపోవడంతో రుణాలు ల్యాప్స్‌ అయ్యాయి. వారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి రుణాలు మంజూరు చేస్తాం.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...