నిగ నిగలాడే యాపిల్.. మెరిసిపోయే మామిడి పండు.. ఎర్రగా కనిపించే పుచ్చపండు.. నోరూరిస్తాయి.. వెంటనే తినాలనిపిస్తాయి. కానీ జరభద్రం.. వాటి పక్కన రోగాలు పొంచి ఉన్నాయి.. రంగు.. రుచి.. వాటిలో పోషకాల విషయం తర్వాత.. వివిధ రకాల పండ్లను విషపూరిత.. నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా అందిస్తుండడంతో ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన పండు అనారోగ్యాన్ని పంచిపెడుతున్నాయి. రోజుకో పండు తింటే ఆరోగ్యమని డాక్టర్లు చెబుతుంటే.. వాటిని పండించేందుకు చేస్తున్న కల్తీ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తోంది.
పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు! అందులోనూ మామిడి, అరటి, యాపిల్ అంటే నోరూరనివారు ఎవరుంటారు? కాని ఆ పండ్లని మగ్గపెట్టేందుకు వాడే విషపదార్థాల గురించి వింటుంటేనే భయం కలుగుతోంది. మరీ ముఖ్యంగా కార్బైడ్‌తో పండించిన పండ్లని ముట్టుకోవాలంటేనే దడ పుడుతోంది. మార్కెట్లో లభిస్తున్న వివిధ రకాల పండ్లలో కొన్ని రకాల రసాయనాలను వినియోగించడం ద్వారా వాటిని పక్వానికి తీసుకువస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సీజన్లో ప్రతి ఒక్కరూ తినేందుకు ఆసక్తి చూపించే మామిడి, యాపిల్, అరటిపండ్లు, ద్రాక్ష పండ్లలో కూడా అటువంటి రసాయనాలను వినియోగిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఉట్నూర్, మంచిర్యాల, జగిత్యాల ప్రాంతాల నుంచి పండ్లు ఎక్కువగా దిగుమతి అవుతాయి.
ఖాతరు చేయని పండ్ల వ్యాపారులు
హైకోర్టు హెచ్చరించినా పండ్ల వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. లాభార్జనే తప్ప ప్రజల ప్రాణాలకు ముప్పని తెలిసినా వారికి పట్టడం లేదు. పండ్లను గోదాముల్లో నిల్వ ఉంచేందుకు పంటలపై వాడే శిలీంధ్ర నాశకాల (ఫంగిసైడ్స్)ను విచ్ఛలవిడిగా వినియోగిస్తున్నారు. కాల్షియం కార్బైడ్‌తో మామిడి కాయలు, నిషేధిత రసాయనాలతో సపోటా, అరటి, కర్బూజాలను మగ్గిస్తున్నారు. ఫంగిసైడ్స్ కలిపిన పండ్లు తింటే వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణకోశ, కేన్సర్, నాడీ-రక్తప్రసరణ సమస్యలు, గుండె, కిడ్నీ వ్యాధులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
కార్బైడ్ వినియోగం నేరం..
కార్బైడ్ వినియోగానికి సంబంధించి కొన్ని రకాల చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. పండ్లను పండించేందుకు కార్బైడ్ గ్యాస్ వాడడం ఆహార భద్రత, ప్రమాణాల(అమ్మకాల నిషేధం, ఆంక్షలు) చట్టం-2011 ఉప నిబంధనలు 2, 3, 5 కింద నిషేధించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని నిల్వ ఉంచినా, అమ్మినా, పంపిణీ చేసినా, దిగుమతి చేసినా నేరంగా పరిగణిస్తారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 నిబంధనలు ప్రకారం అలా చేసినవారికి జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
దాడులు నామమాత్రం
విచ్ఛలవిడిగా రసాయనాలతో మగ్గించిన పండ్లను విక్రయిస్తున్నా అధికారుల దాడులు అంతంతమాత్రమే. గతేడాది ఉట్నూర్‌లో పండ్లు మగ్గించే చాంబర్లో దాడులు చేశారు. కొన్ని పండ్ల నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. పండ్లను మగ్గించడానికి కార్బైడ్‌ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేశారు. ఏడాదిలో ఒకటి, రెండుసార్లు మాత్రమే దాడులు నిర్వహించి, అధికారులు చేతులు దులుపుకుంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మామిడి పండ్లు ఇలా...
ఆరోగ్యానికి అత్యంత ప్రమాదాన్ని కలిగించే కాల్షియం కార్బైడ్‌ను వ్యాపారులు వినియోగించి పండ్లను పక్వానికి తీసుకువస్తున్నారు. మామిడి కాయలను చెట్ల నుంచి దించిన తరువాత వాటిని లారీలో వేసుకుని తీసుకువచ్చే సమయంలో పండ్లుగా మారుస్తారు. ఆ కాయల మధ్యలో కాల్షియం కార్బైడ్‌ను పొట్లాల రూపంలో పెడతారు. అప్పుడు కాల్షియం కార్బైడ్ ఆర్సినిక్, పాస్పరస్ల జాడలు కలిగి నీటితో చర్య చెందినప్పుడు ఎసిటిలిన్ అనే గ్యాస్‌ను విడుదల చేస్తుంది. ఈ సమయంలో విడుదలయ్యే ఎసిటిలిన్ గ్యాస్ కాయ త్వరగా రంగుమారేలా చేయడంతోపాటు మెత్తగా అయ్యేలా చేస్తుంది. ఈ ఎసిటిలిన్ అనే గ్యాస్‌ను సాధారణంగా వెల్డింగ్‌కు వినియోగిస్తుంటారు. దీనిని ఆయా పండ్లలో వినియోగించడం వల్ల క్యాన్సర్ ప్రమాదకరమైన వ్యాధి బారినపడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాల్షియం కార్బైడ్‌తోపాటు ఈ మధ్యకాలంలో ఇథరాల్ అనే ఒకరకమైన పురుగుల మందును కూడా వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
కార్బైడ్‌తో..
కార్బైడ్. ఇదే.. ఇప్పుడు భయాందోళనలు కలిగిస్తున్న రసాయనం. పేరుకి నిషేధించినా విచ్ఛలవిడిగా ఉపయోగిస్తూ ప్రమాదకర రోగాలకు కారణమౌతున్న రసాయనం ఇది. కార్బైడ్.. ఇది పండ్లను మగ్గేలా చేస్తుంది. దీనివల్ల ఎలాంటి జబ్బులొస్తాయి. ఏ పండ్లనూ వదలడం లేదు.. మామిడి నుంచి, పైనాపిల్ వరకు... ప్రతీ పండూ రసాయనాలతోనే మగ్గుతోంది. ఫ్లూట్ మార్కెట్లన్నీ కెమికల్స్‌తో నిండుతున్నాయి. విషరసాయనాలు లేని పండ్లు దొరకటం అసాధ్యంగా మారుతోంది.. అసలు పండ్లు తింటున్నామా? లేక జబ్బులు కొని తెచ్చుకుంటున్నామా అనే సందేహం వస్తుందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
మార్పు రావాలి..
తెల్లనివన్నీ పాలుకాదు.. ఘాటువన్నీ మసాలా దినుసులు కాదు.. నూనెలన్నీ నమ్మకమైనవి కాదు.. మిలమిల మెరిసేవన్నీ పండ్లు కాదు. ఏం తినాలి? ఏం తాగాలి? ఈ కల్తీ రాజ్యంలో ఎలా బతకాలి? తిండి కలిగితే కండగలదోరు, కండగలవాడే మనిషోరు....అన్నాడు గురజాడ. జవసత్వాల్ని మింగేసి, ప్రమాదకరమైన రోగాల పాల్జేసే పదార్ధాలు ప్రజారోగ్యానికి తీరని ప్రమాదం.. దీనిపై వినియోగదారుల్లో చైతన్యం రావాలి. ప్రభుత్వ తీరులో మార్పు రావాలి. కఠిన చర్యలు తీసుకోవాలి.
జాగ్రత్తలు తప్పనిసరి..
కార్బైడ్ గురించి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా, వ్యాపారులకక్కుర్తి ముందు ఉపయోగం లేకుండా పోతోంది. ఆరోగ్య శాఖ అధికారులు కూడా కార్బైడ్ వాడకాన్ని చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాబట్టి కార్బైడ్ పండ్ల నుంచి దూరంగా ఉండాల్సిన బాధ్యత వినియోగదారులదే. ఇప్పుడు కార్బైడ్‌తో పండించని పండ్లు అంటూ ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు వెలుస్తున్నాయి. నమ్మకం ఉంటే వాటిలో పండ్లను తీసుకోవచ్చు. లేదా పండ్లని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
- కార్బైడ్‌తో పండించిన పండ్లు చూడ్డానికి మరీ పచ్చగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి.
- చాలా సందర్భాల్లో పండ్లు ఒక చోట మగ్గి, మరో చోట పచ్చిగా ఉన్నట్టు రెండు రంగుల్లో ఉంటాయి.
- పైకి పండిపోయినట్లు ఉండి, లోపల పచ్చిగా ఉందంటే.... అది కచ్చితంగా కార్బైడ్ మహిమే!
- కార్బైడ్‌తో పండిన పండ్లు కృత్రిమంగా మగ్గి ఉంటాయి కాబట్టి, వాటిలోని తీపిశాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
- అన్నింటికి మించి మామూలు పండ్లు మగ్గినప్పుడు వచ్చే ఆ సువాసన, కార్బైడ్ పండ్లలో కనిపించదు. అంటే రంగు, రుచి, వాసనల ద్వారా ఫలానా పండు కార్బైడ్‌తో మగ్గించారు అని తెలుసుకోవచ్చు.
- ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కోసారి మోసపోయే ప్రమాదం ఉంది. కనుక తినబోయే ముందు కాసేపు పండ్లను నీటి ధార కింద ఉంచితే, వాటిలోని విష రసాయనాలు చాలావరకూ కొట్టుకుపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు నిపుణులు.
ఇందుకు వాడుతారు..
మామిడి, అరటి, సపోటా వంటి పండ్లను చెట్టు మీద నుంచి కోసిన తరువాత కూడా మగ్గేందుకు కాస్త సమయం పడుతుంది. ఇది నిదానంగా జరిగే చర్య. పైగా వాటిని మగ్గపెట్టేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా కాస్త కాల్షియం కార్బైడ్‌ని కనుక వాటి మీద ప్రయోగిస్తే... అవి ఇట్టే పండిపోతాయి. లేదా కనీసం పండినట్టు కనిపిస్తాయి. ఇందులో వ్యాపారులకు మరో లాభం కూడా ఉంది! పచ్చిగా ఉండగానే కాయలని కోయడం, అవి గట్టిగా ఉన్నప్పుడే మార్కెట్‌కు తరలించడం వల్ల పండ్లు దెబ్బతినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పైగా కార్బైడ్‌తో పండిన పండ్లు లోపల ఇంకా పచ్చిగానే ఉంటాయి కాబట్టి చాలా రోజులు నిల్వ ఉంటాయి కూడా.
అరటి పండ్లలో..
'రోజుకో అరటి పండు.. ఆరోగ్యం మెండు' అంటుంటారు. అయితే ఆ అరటిపండును సహజంగా కాకుండా కృత్రిమంగా పండిస్తున్నారు. ఉత్ప్రేరకాలు ఉపయోగించి పండించి విక్రయిస్తుండడంతో వినియోగదారులు వాటిని తిని అనారోగ్యం బారిన పడుతున్నారు. కాయలుగా ఉన్నవాటిని తీసుకువచ్చి రసాయనాలను రంగరించి పండిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్, మంచిర్యాల, జగిత్యాల నుంచి పండ్లను దిగుమతి చేసుకుంటారు. అరటి పండ్లను సహజంగా మాగబెట్టే విధంగా అమలులో ఉంది. దీనిలో ఎథిలిన్ ఛాంబర్‌ను ఉపయోగిస్తారు. అరటి గెలల సంఖ్యను అనుసరించి తగిన ఉష్ణోగ్రతలో ఉంచుతారు. ఎథిలిన్ ఛాంబర్స్‌లోని గ్యాస్ కారణంగా అరటి పండ్లు తన సహజ స్థితిలోని రుచి, రంగును కోల్పోకుండా మగ్గుతాయి.
Comments
Post a Comment