Skip to main content

కబ్జా కోరల్లో కేఆర్‌కే - Occupy Lands in KRK Colony, Adilabad


- ప్లాట్లు కబ్జా చేసి అమ్మేస్తున్న స్థానిక నాయకులు
- అడిగితే బెదిరింపులు
- లబోదిబోమంటున్న యజమానులు

మావల మండలంలోని కస్తాల రాంకిష్టు కాలనీ.. దశాబ్ద కాలం క్రితం పేదల కోసం ఏర్పాటైంది. ప్రభుత్వాలు పేదలకు భూములు కేటాయించకపోవడంతో ఎర్ర జెండా పార్టీలు పేదలతో కలిసి అక్కడ గుడిసెలు నిర్మించాయి. కనీస వసతులు లేకపోయినా అక్కడ పేదలు సంవత్సరాల తరబడి నివసించారు. కాలం గడిచిన కొద్దీ కాలనీ అభివృద్ధి చెందింది. అక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో వివిధ అవసరాల నిమిత్తం పేదలు తాము నివసించిన గుడిసెలను అమ్ముకోవడానికి సిద్ధం కాగా, మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను నిజం చేసుకోవడానికి, భవిష్యత్‌ అవసరాల కోసం వాటిని కొనుగోలు చేసి ఉంచుకున్నారు.
ఈ కొనుగోలు, అమ్మకాలు కేవలం బాండ్‌ పేపర్ల మీదనే కొనసాగాయి. దీన్ని అవకాశంగా మలుచుకొని కొందరు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులమనే చెప్పుకునే వారు కాలనీలో కబ్జాల పర్వం మొదలుపెట్టారు. ఖాళీ జాగా, లేదా బేస్‌మెంట్‌ వరకు కట్టి కనిపించినా సరే కబ్జా చేసేశారు. వాటిని ఇతరులకు అమ్ముకున్నారు. యజమానులు వచ్చి అడిగితే మధ్యవర్తిత్వం నడిపించారు. డబ్బులు డిమాండ్‌ చేయడం, అడిగినంత ఇవ్వకపోతే నీ ప్లాట్‌ మర్చిపొమ్మని చెప్పడం, వినకపోతే బెదిరింపులకు దిగడం మొదలుపెట్టారు. ఇలా వందలాది ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకుంటూ లక్షలాది రూపాయలు సంపాదించేసుకున్నారు.
ఒక్కొక్కరికి పదేసి ఇండ్లు
పార్టీలు, సంఘాల నాయకులుగా చెప్పుకునే కొందరు కేఆర్‌కే కాలనీలో ప్లాట్లు కబ్జా చేసుకొని పదేసి ఇండ్లు నిర్మించుకొని వాటిని కిరాయికి ఇస్తున్నారు. స్థానిక నాయకుడిగా చెప్పుకునే ఓ వ్యక్తి ఈ కబ్జాల పర్వంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జాగాను కబ్జా చేసి రాత్రికి రాత్రే అక్కడ నిర్మాణాలు మొదలు పెడుతున్నాడు. యజమానులు వస్తే వారిని తీవ్ర బెదిరింపులకు గురి చేస్తున్నాడు. మానవ హక్కుల అసోసియేషన్‌ నాయకుడిగా చెప్పుకునే మరో వ్యక్తి కేఆర్‌కే కాలనీలో కనీసం పది ఇండ్లు కట్టాడు. అతను మాత్రం జిల్లా కేంద్రంలో నివాసముంటూ ఆ ఇండ్లను కిరాయికి ఇస్తున్నాడు. ఈ కబ్జాల పర్వం నిరంతరంగా కొనసాగుతుండడంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు తీవ్ర నష్టాలకు గురై ఆర్థికంగా కుంగిపోతున్నారు.
ఊరడింపులు.. బెదిరింపులు..
తమ ప్లాటు కబ్జా అయిందని ఎవరైనా స్థానిక నాయకులకు వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటే.. ముందుగా వారిని ఊరడిస్తున్నారు. కబ్జా చేసిన వారికే ఆ ప్లాటు వదిలివేయాలని, వేరే ప్లాటు చూయిస్తామని చెబుతున్నారు. నెలలు గడిచినా వేరే ప్లాటు చూయించక మళ్లీ కలిస్తే.. చూయిస్తామంటూ చెబుతున్నారు. ఒత్తిడి తెస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవాలని, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా సివిల్‌ కేస్‌ అంటారని చెబుతున్నారు. ప్లాట్ల దగ్గరికి వెళ్తే.. ఇటు వైపు మళ్లీ వస్తే కాళ్లు చేతులు విరగ్గొడ్తామని అక్కడి వారు భయపెడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ప్లాట్ల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాణభయంతో ప్లాట్లను విడిచిపెట్టేసి ఆర్థికంగా నష్టపోతున్నారు.
కొన్నింటికే పట్టాలు
కస్తాల రాంకిష్టు కాలనీలో గ్రామపంచాయతీ అధికారులు సుమారు మూడున్నర వేల ఇండ్లకు పన్నులు వసూలు చేయగా, పట్టాలు ఉన్న ఇండ్లు కనీసం వందల సంఖ్యలో కూడా లేవు. గతంలో ప్రభుత్వం జీఓ నెంబర్‌ 58 కింద కొన్ని ఇండ్లకు పట్టాలు జారీ చేసింది. ఇంకా గ్రామపంచాయతీ పన్ను వసూలు చేయని ఇండ్లు కూడా వందల సంఖ్యలోనే ఉంటాయి. ఇలా పన్ను కట్టకుండా, ఇంట్లో ఎవరూ లేకుండా ఉండే ఇండ్లు, జాగాలను కబ్జా చేసేస్తున్నారు. బాండ్ల మీదనే క్రయ విక్రయాలు జరగడం, సివిల్‌ కేసు అంటూ పోలీసులు పట్టించుకోకపోవడం, కోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా లేకపోవడం వంటి కారణాలతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు.

Comments

Popular posts from this blog

మహిళ ఒక చైతన్య దీప్తి..- కవిత - Womens Day poetry

మహిళ ఒక చైతన్య దీప్తి.. ఒడిని బడిగా మలిచి ఉపాధ్యాయిని అవుతుంది.. పిల్లలకు విద్యాబుద్ధులు చెబుతుంది. -ఓ సావ్రితిబాయిఫూలేలా.. ఆడదంటే ఆదిశక్తి.. అమానుషాలు,అత్యాచారాలను ఖండించి చట్టాలను తెచ్చుకునే సబల అయ్యింది.. -ఓ నిర్భయలా.. ఆడదంటే ఆకాశాన్ని అందుకోలేకపోవచ్చు.. కాని తన శక్తి సామర్థ్యంతో ఆకాశానికి ఎదుగుతుంది. ఎందరికో స్ఫూర్తినిస్తోంది.. ఒక మహిళగా లోకాన్ని మేల్కొలుపుతోంది. -సునితావిలియమ్స్‌లా.. ఆడది అబల కాదు.. సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటింది. మన సిరివెన్నెల మువ్వెన్నెల జెండాను ఎగురవేసింది -సింధులా.. ఆడది నిరంతరం శ్రమిస్తూ.. విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ.. నలుగురికి స్ఫూర్తిదాయకమైంది.. దేశ ద్రోహుంని కాదే..దేశ దాడులనూ.. ఖండిస్తూ ఝాన్సీలా మారింది. -ఓ మలాలలా.. ఆడది అంటే అమ్మతనం కాదు.. అందరిచే అమ్మా అని పిలిపించుకునేంత గొప్పతనం స్త్రీ జన్మది.. ఆచరణలో తెచ్చి పెట్టింది.. మానవత్వాన్ని ప్రపంచమంతా చాటింది.. ఓ మదర్‌థెరిస్సాలా.. అమ్మ ఒడి బడిగా మారితే.. అమ్మకష్టం కన్నీళ్లుగా జారితే.. అమ్మతనం అందంగా తోచితే.. అమ్మ ప్రేమ ఆప్యాయతలను కురిపిస్తుంటే.. స్త్రీని పూజించే చోట.. స్...

ద‌ర్జా‌లేని ద‌ర్జీ బ‌తుకులు - ప్రపంచ టైలర్స్‌ దినోత్సవం - National Tailors Day

సమాజంలో సామాన్యుడు మొదలు అత్యున్నతస్థానం అలంకరించే అమాత్యు లు, అధికారులు, సినీ కళాకారుల వరకు దర్జీ వృత్తిదారులతో సంబంధాలు ముడిపడి ఉంటాయి. కానీ వారి నుంచి దర్జీలు ఆర్జించగలిగేది ప్రశంసలు మాత్రమే. దర్జీలకు వయస్సు మళ్లిన తర్వాత బతుకు బరువు కావడంతోపాటు సానుభూతి మాత్రం మిగులుతుందన్న ఆవేదన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వాలెన్ని మారినా ప్రోత్సాహకాలు లేకపోవడంతో దర్జీల జీవితాలు దర్జాకు దూరం అవుతున్నాయి. ప్రత్యేకించి ప్రస్తుతం ఫ్యాషన్‌ రంగం విస్తరించడం, అందుకు ధీటుగా రెడీమేడ్‌ షోరూంల ఏర్పాటుతో టైలర్స్‌ ఆర్థికాభివృద్ధికి దూరం అవుతున్నారు. ఏండ్ల తరబడి తమ హక్కుల కోసం, ప్రభుత్వ ఆదరణ కోసం ఆశగా ఎదురు చూస్తున్న టైలర్స్‌తో పాటు అదే వృత్తికి అనుబంధంగా ఉన్న కార్మికులు, మహిళలు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పది వేలకుపైగా స్త్రీ, పురుషులు, యువత టైలరింగ్‌నే నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కార్పొరేట్‌ పోటీ.. ఫ్యాషన్‌పై యువత మోజు.. నేడు అన్ని వయస్సుల వారికి రెడీమేడ్‌ దుస్తులు అందుబాటులోకి వచ్చాయి. ఫ్యాషన్‌ రంగం విస్తరించింది. టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు, షాట్‌లు రకరకాల దుస...

ప్రపంచ వినియోగదారుల దినోత్సవం - World Consumer Rights Day - కల్తీ.. దోపీడీ!

రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు.. కల్తీ అవుతున్న సరుకులు.. తూకంలోనూ మోసాలు.. హైటెక్‌ ట్రిక్కులతో జిమ్మిక్కులు.... ఇలా నిత్యావసరాల విషయంలో వినియోగ దారులు నిత్యం దగా పడుతున్నారు. కండ్లెదుటే జరిగే కనికట్టును కనిపెట్టలేక జేబులు ఖా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సరుకుల ధరలకు అడ్డూ అదుపన్నదే లేకుండాపోయింది. కొనుగోండ్లలో ఎదురయ్యే మోసం ఇంతా అంతా కాదు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్న గ్రామీణ వినియోగ దారులు నిత్యం ఏదో ఒక రూపంలో వ్యాపారస్తుల చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల్లో కల్తీ, అధిక ధరలు వినియోగ దారుల నడ్డి విరుస్తున్నాయి. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగ ుమందులు రైతులకు శాపంగా మారాయి. బోగ స్‌ ఫైనాన్స్‌ సంస్థలు, చిట్‌ ఫండ్‌ల వల్ల వినియోగ దారులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. నాణ్యత లేని ఎలవూక్టానిక్‌ గ ృహోపకరణాలే కాకుండా తూకాల్లో మోసాలు వినియోగ దారులను భాదిస్తున్నాయి. రోజురోజుకు పెరుగ ుతున్న ధరలు రోజురోజుకు పెరుగ ుతున్న ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బియ్యం, పప్పు, ఉప్పు, పంచదార, చింతపండు, నూనె, పాలు, కిరోసిన్‌, గ్యాస్‌, పెట్రోల్‌ ఒక్కటేంటి.. ఏ సరుకు ధర ...