జర్నలిస్టుల
జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని తెలంగాణ జర్నలిస్ట్స్ జేఏసీ
రాష్ట్ర కన్వీనర్ పురుషోత్తం నారగౌని అన్నారు. జీఓలతో సంబంధం లేకుండా
అక్రిడేషన్లు మంజూరు చేయాలని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
చేస్తూ టీజేజేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
ధర్నాకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గండ్రత్ సుజాత, బీజేపీ జిల్లా
అధ్యక్షులు పాయల శంకర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ ఫారుఖ్ అహ్మద్,
పలువురు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పురుషోత్తం నారగోని
మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన కష్టాలు
దూరమవుతాయనుకున్న జర్నలిస్టులకు మరింత పెరిగాయన్నారు. ఎంపానల్మెంట్తో
సంబంధం లేకుండా అందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పత్రికా రంగం స్వయం సమృద్ధి సాధించేలా ప్రతి పత్రికకు లక్ష
రూపాయలకు తగ్గకుండా ప్రకటనలు ఇవ్వాలన్నారు. తెలంగాణలోని ప్రతి పత్రికకు,
మీడియాకు ఒక ఎకరం స్థళం కేటాయించి ముద్రణా యంత్రాలు, ప్రసార సామగ్రి కోసం
రుణ సదుపాయం కల్పించాలన్నారు. టీజేజేఏసీ ఉత్తర తెలంగాణ కన్వీనర్ ఫిరోజ్
ఖాన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు
చేయాలన్నారు. ఆరోగ్య కార్డులను వెంటనే ఇచ్చి వాటిని అమలులోకి తేవాలన్నారు.
ప్రతి జర్నలిస్ట్‌కు స్టేట్పాస్ ఇవ్వాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు
ప్రయివేట్ విద్యాసంస్థల్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే
భరించాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన జర్నలిస్టులకు రూ. పదివేల పెన్షన్
ఇవ్వాలన్నారు. గ్రామీణ విలేకరులకు కనీస వేతనాన్ని ఇవ్వాలని, ఉద్యోగ భద్రత
కల్పించాలన్నారు. అనంతరం జేసీ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో టీజేజేఏసీ జిల్లా కన్వీనర్ ఎ. లింగన్న, నిర్మల్ జిల్లా
కన్వీనర్ రషీద్ ఆలమ్, నాయకులు ఉజ్జ సతీష్, అబ్దుల్ నయీమ్
పాల్గొన్నారు.
- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment